మనం తీసుకునే నిర్ణయాలు, చెప్పే మాటలకు ఎదుటి వారి రియాక్షన్ ఎలా ఉంటుందో అంచనా వేయడం కూడా ఒక బలమే. ఆ రియాక్షన్‌ను బట్టి మన ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఇదే సూత్రాన్ని అగ్రరాజ్యం అమెరికా అనుసరిస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారిన దేశం చైనా.
అమెరికా తీసుకునే చాలా నిర్ణయాలు, ప్రకటనలు అన్నీ ఈ డ్రాగన్ దేశం టార్గెట్‌గానే ఉంటున్నాయి. వీటిపై చైనా కూడా ఘాటుగానే స్పందిస్తోంది. ఈ క్రమంలోనే తమ నిర్ణయాల పట్ల చైనా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసిందట.
పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న యూఎస్ మిలటరీ కమాండర్లు దీన్ని తయారు చేశారని తెలుస్తోంది. ఈ పసిఫిక్ ప్రాంతంలో తమ మిలటరీ అమ్మకాలు, అమెరికా మద్దతుతో జరిగే సైనిక చర్యలు తదితరాలపై చైనా రియాక్షన్ ఎలా ఉంటుంది? అనే విషయం తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయం చేస్తుందట.
2020 ఆరంభం నుంచి అమెరికా-చైనా బంధాలపై ప్రభావం చూపిన కీలకాంశాలకు సంబంధించిన డేటాను ఈ సాఫ్ట్వేర్ అధ్యయనం చేసింది. దీని ఆధారంగా చైనా రియాక్షన్‌ను అంచనా వేస్తుందని సమాచారం. ఈ సాఫ్ట్వేర్ సాయంతో తాము ఎలాంటి చర్యలు తీసకుంటే చైనా విపరీతంగా రియాక్ట్ అవుతుందో అంచనా వేయొచ్చని అధికారులు అంటున్నారు.