Prince Sultan Air Base : ఇరాన్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు విరుచుకుపడుతుంటే.. ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. తాజాగా సౌదీలోని అమెరికన్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడి చేసింది. శుక్రవారం ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడిలో 10 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డట్లు సమాచారం.
అలాగే, కొన్ని సైనిక విమానాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై అమెరికా, సౌదీ ప్రభుత్వాల నుంచి అధికారిక సమాచారం మాత్రం రాలేదు. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ జరిపిన దాడిలో యూఎస్ రీఫ్యూయెలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ధ్వంసమైందని అక్కడి మిలిటరీ ప్రతినిధులు తెలిపారు. కొందరు సైనికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. 10 ట్రూప్లకు చెందిన సైనికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన శాటిలైట్ ఇమేజ్ ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. మిస్సైళ్లతోపాటు, మానవరహిత డ్రోన్లతో కూడా ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. నెల రోజులుగా ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సైనికులు, పౌరులతోపాటు అమెరికా, ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించారు.
ఇక అమెరికాకు సంబంధించి 300 మంది గాయపడినట్లు అక్కడి అధికారవర్గాలు తెలిపాయి. అయితే, వీరిలో చాలా మంది కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ నెల ప్రారంభంలో కూడా ఒకసారి దాడి జరిగింది.