America Spy | ఈ ఏడాది జనవరి – ఫిబ్రవరి మధ్య అమెరికా గగనతలంలో చైనా బెలూన్లు కనిపించడంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అమెరికాపై చైనా గూఢచర్యానికి పాల్పడుతుందని ఆరోపించింది. ఆ తర్వాత నిఘా బెలూన్లను కూల్చివేసిన విషయం విధితమే. ఈ వివాదం కారణంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫిబ్రవరిలో తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇటీవల వివాదం సద్దుమణిగినా బ్లింకెన్ పర్యటన షెడ్యూల్ ఇప్పటికీ ఖరారు కాలేదు. ఈ క్రమంలోనే చైనాపై అమెరికా గూఢచర్యానికి పాల్పడుతుందని డ్రాగన్ దేశం ఆరోపించింది.
అమెరికా ఉపగ్రహాలు కనీసం 14 సార్లు చైనా ఉపగ్రహాలపై నిఘా పెట్టేందుకు ప్రయత్నించాయని చెప్పింది. గత రెండేళ్లలో నిఘాకు ప్రయత్నించాయని పేర్కొంటూ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. యూఎస్ వైమానిక దళం జియోసింక్రోనస్ స్పేస్ సిట్యుయేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్‌కు చెందిన ఉపగ్రహాలు చైనా అత్యంత ప్రత్యేకమైన, అధునాతన ఉపగ్రహాలకు దగ్గరగా వచ్చి గూఢచర్యానికి పాల్పడిందని ఆరోపించింది. ఈ నివేదికను చైనీస్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇన్ఫ్రారెడ్, లేజర్ ఇంజినీరింగ్‌లో నిపుణుడు కై షెంగ్ నేతృత్వంలో పరిశోధన జరిగింది.
చాంగ్‌చున్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్టిక్స్‌లో పనిచేస్తున్న ఫైన్ మెకానిక్స్ అండ్ ఫిజిక్స్ బృందానికి చెందిన నిపుణులు పరిశోధనలో పాల్గొన్నారు. చైనా ప్రస్తుతం అనేక జియోశాటిలైట్లను నిర్వహిస్తోంది. వాటితో కమ్యూనికేషన్, గైడెన్స్, రిమోట్ సెన్సింగ్ సేవలను అందిస్తుంది. జియో ఉపగ్రహాలు భూమి మెరిడియన్‌పై ఉన్న ప్రదేశంలో ఉన్నాయి. ప్రస్తుతం అనేక దేశాలు కమ్యూనికేషన్, నిఘా, బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థ సేవల కోసం ఉపగ్రహాలను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాయి. బీజింగ్‌కు చెందిన శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ ఉపగ్రహం మరొక దేశానికి దగ్గరగా వచ్చిన సంఘటనలపై దేశాలు సాధారణంగా మౌనంగా ఉంటాయని అన్నారు.
దీనికి కారణం అలాంటి సమాచారం సెన్సిటివ్‌గా పరిగణిస్తుంటారన్నారు. అయితే, చైనా అలాంటి సున్నితమైన అంశాన్ని బయటపెట్టడం వెనుక అమెరికాకు ధీటుగా సమాధానం ఇవ్వడమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. గతంలో అమెరికా గగనతలంలో నిఘా బెలూన్ ఘటనలతో చైనా ఇబ్బందులను ఎదుర్కొన్నది. తాజాగా అంతరిక్షంలో గూఢచర్యానికి అమెరికా పాల్పడుతోందంటూ ఇరుకున పెట్టేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అయితే, చైనా ప్రకటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, సైనిక ఘర్షణ తలెత్తే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.