వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ నేరస్తుడని అమెరికా ఆరోపించింది. ఆ దేశానికి చెందిన ఎగువ సేనేట్‌లో ఏకపక్షంగా పుతిన్‌పై తీర్మానం చేశారు. సాధారణంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యే సేనేట్‌లో.. పుతిన్ అంశంలో ఏకపక్షంగా తీర్మానాన్ని చేశాయి. రిపబ్లికన్ సేనేటర్ లిండ్సే గ్రహమ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. రెండు పార్టీలకు చెందిన సేనేటర్లు ఆ తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన అమెరికాపై యుద్ధ నేరాల కింద విచారణ చేపట్టాలని ఆ తీర్మానంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును కోరారు. ఉక్రెయిన్ ప్రజలపై పాల్పడిన అకృత్యాల నుంచి పుతిన్ తప్పించుకోలేరని, అందుకే డెమోక్రాట్లు-రిపబ్లికన్లు ఒక్కటయ్యారని సేనేటర్ చుక్ షూమర్ తెలిపారు. రష్యా మాత్రం స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్‌పై దాడికి దిగింది. ఉక్రెయిన్ను డినాజిఫై చేయాలని భావిస్తున్నట్లు పుతిన్ చెప్పారు.