వాషింగ్టన్: భారత్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర నిరాశాజనకంగా ఉందని అమెరికా విమర్శించింది. రష్యాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఆ కామెంట్ చేసింది. అమెరికా మిత్ర దేశాల ఆంక్షలు రష్యాపై ఉన్నా.. ఆ దేశ మంత్రి లవ్రోవ్ ఇవాళ ఇండియాలో పర్యటిస్తున్నారు. అయితే ఆంక్షల సమయంలో రష్యాతో వాణిజ్యం జరపడాన్ని అమెరికా తప్పుపడుతోంది. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సౌర్వభౌమాధికారం వైపు మనం నిలబడాలని, ఉక్రెయిన్‌కు అండగా ఉండాలని, కానీ యుద్ధ కాంక్షతో ఉన్న పుతిన్‌కు ఫండింగ్ చేయడం సరైంది కాదు అని అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండో ఆరోపించారు. వాషింగ్టన్లో రిపోర్టర్లతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా, భారత్ మధ్య జరుగుతున్న వ్యవహరం తీవ్ర నిరుత్సాహపరుస్తోందన్నారు. ఇదే అంశంపై అస్ట్రేలియా మంత్రి డాన్ టెహన్ స్పందించారు. ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని, నియమావళి ఆధారంగా ముందుకు వెళ్లాలన్నారు. క్వాడ్ గ్రూపులో ఉన్న సభ్య దేశాలు ఇండియా వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.