Donald Trump | వాషింగ్టన్, ఫిబ్రవరి 2: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఆయా దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామంటూ మొదటి నుంచి చెబుతున్న అగ్రరాజ్య అధినేత.. ఆ హెచ్చరికలను నిజం చేశారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించే దస్త్రంపై శనివారం సంతకం చేశారు. దీంతో ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్‌కు తెరలేచింది. దీనికి ప్రతిస్పందనగా కెనడా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా నుంచి తమదేశానికి వచ్చే 155 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై తాము 25 శాతం సుంకాలు విధించినట్టు, వాటిని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల ప్రభావం మిగిలిన దేశాలకు కూడా వ్యాపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌పై సైతం రేపో మాపో ఆంక్షలు విధించే అవకాశముందని వారు తెలిపారు. అమెరికా చర్యపై చైనా డబ్ల్యూటీవోను ఆశ్రయించినా, ప్రతీకార చర్యలకు దిగినా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా పలు అంతరాయాలు ఏర్పడతాయని అంటున్నారు. పైగా దీని కారణంగా అమెరికా వృద్ధి తగ్గుతుందని, మిగిలిన దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని అవి హెచ్చరిస్తున్నాయి.
వలసలు, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేసేందుకే..
ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. అక్రమ వలసదారులు, డ్రగ్స్‌ను అరికట్టడానికే తానీ చర్య తీసుకున్నట్టు తాజాగా ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో వెల్లడించారు. ‘మెక్సికో, కెనడా(కెనడియన్ ఎనర్జీపై 10 శాతం) దేశాల దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నా. అలాగే చైనా నుంచి అదనంగా 10 శాతం వసూలు చేస్తా. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ చట్టం (ఐఈఈపీఏ) ప్రకారం దీనిని అమలు చేస్తున్నా. ఎందుకంటే అక్రమ వలసదారులు, ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు మా పౌరుల ప్రాణాలను తీస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా వాటిని అరికట్టి, వారందరి రక్షణ చూడటం నా బాధ్యత. సరిహద్దులు, ఇతర మార్గాల నుంచి వెల్లువలా అమెరికాలోకి వస్తున్న అక్రమ వలసదారులను అడ్డుకుంటానని ఎన్నికల ప్రచారంలోనే హామీ ఇచ్చా. అందుకే అమెరికా పౌరులు అధికులు నాకు ఓటేసి పట్టం కట్టారు’ అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సుంకాలు అమలుచేయడానికి ట్రంప్ ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించారు. ఈ సుంకాల అమలు మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.
కెనడా ప్రతీకార చర్యలు
కెనడా దిగుమతులపై ట్రంప్ విధించిన సుంకాలపై కెనడా కూడా తీవ్రంగానే స్పందించింది. ‘155 బిలియన్ కెనడియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నాం. వాషింగ్టన్ చర్యలకు ఇది మా ప్రతిస్పందన. ఇందులో 35 బిలియన్ డాలర్ల వస్తువులపై సుంకాలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయి. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయి’ అని కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించారు.
మండిపడ్డ మెక్సికో
తమపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించడం పట్ల మెక్సికో మండిపడింది. అమెరికా చర్యకు ప్రతీకార చర్యకు దిగాలని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ పార్డో ఆదేశించారు. అమెరికా వాణిజ్య చర్యలపై తమ వద్ద ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ సహా పలు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. క్రిమినల్ సంస్థలతో మెక్సికో ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని అమెరికా చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. అత్యంత శక్తివంతమైన సింథటిక్ ఓపియాయిడ్ అయిన ఫెంటానిల్ వినియోగంపై మెక్సికో అధ్యక్షురాలు అమెరికా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గత నాలుగు నెలలుగా తమ దేశంలో 40 టన్నుల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగా అందులో 20 మిలియన్ల ఫెంటానిల్ డోస్‌లు ఉన్నాయన్నారు. 10 వేల మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. అమెరికాకు నిజంగానే ఫెంటానిల్ వినియోగాన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే వారి దేశంలోని వీధుల్లో సైతం అమ్ముతున్న మాదక ద్రవ్యాలను నిరోధించాలని అన్నారు.
చైనా ఆగ్రహం
ట్రంప్ విధించిన సుంకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా తాము కూడా ప్రతీకార చర్యలకు దిగుతామని ఆ దేశ ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇది కచ్చితంగా ప్రపంచ వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమేనని, తమ హక్కుల రక్షణ, ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ సమస్యను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) దృష్టికి తీసుకువస్తామని తెలిపింది. అయితే ఈ వాణిజ్య యుద్ధాన్ని ఆపడానికి తామెప్పుడూ సిద్ధమేనని ప్రకటించింది. అమెరికా ఆరోపిస్తున్న విధంగా ఫింటానిల్ డ్రగ్ సంక్షోభం అమెరికాకు సంబంధించినదని, అది ఆ దేశ సమస్యని పేర్కొంది. సుంకాల పేరుతో బెదిరింపులకు పాల్పడే కన్నా అమెరికా తన తప్పుడు విధానాలను సవరించుకోవాలని చైనా హితవు పలికింది.
సుంకాలు తగ్గించిన భారత్
కెనడా, మెక్సికోతో పాటు భారత్ దిగుమతులపై కూడా సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన క్రమంలో అమెరికా నుంచి దిగుమతయ్యే హైఎండ్ బైక్‌లు, కార్లు, స్మార్ట్‌ఫోన్ విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీని గణనీయంగా తగ్గిస్తున్నట్టు భారత్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించింది. ఈ చర్యతో అమెరికాకు చెందిన హార్లీ-డేవిడ్సన్, టెస్లా, ఆపిల్ కంపెనీలకు లబ్ధి చేకూరుతుంది. బైక్‌లు, ఫోన్లపై 10 నుంచి 40 శాతం, టెస్లా కార్లపై 55 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు.