Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. పావెల్ ఓ మూర్ఖుడని కామెంట్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వడ్డీ రేట్లను చాలా ఎక్కువగా కొనసాగించారని.. ఆయనను ఎనిమిది నెలల్లో పదవి నుంచి తప్పించనున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చాలా బలంగా ఉందన్నారు. అన్నిరంగాల్లో దూసుకెళ్తూ రికార్డులు సృష్టిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యక్తి (పావెల్) కారణంగా జనం ఇండ్లు కొనలేకపోతున్నారని.. వడ్డీ రేట్లను చాలా ఎక్కువగా ఉండేలా చేస్తున్నాడని.. బహుశా రాజకీయ కారణాలతోనే అలా చేస్తుండవచ్చని ఆరోపించారు. వాస్తవానికి ట్రంప్ 3శాతం పాయింట్లు తక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. గతంలోనూ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్‌గా ఉన్న పావెల్‌ను తొలగిస్తామని పేర్కొన్నారు. అయితే, తాను పూర్తికాలం ఈ పదవిలో ఉంటానని.. అప్పటి వరకు వీడేది లేదని పావెల్ స్పష్టం చేశారు. ట్రంప్ ఆయనను ఎందుకు తొలగించాలనుకుంటున్నారో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కానీ, చాలాకాలంగా వడ్డీ రేట్లను తగ్గించడం లేదని ఆరోపిస్తూ వస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పావెల్‌ను ట్రంప్ తొలగించాలన్న నిర్ణయం తీసుకుంటే.. కారణాలను చట్టబద్ధంగా వివరించాల్సి ఉంటుంది. తన ఆరోపణలను నిజమేనని నిరూపించేందుకు ఆధారాలను సైతం సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినందుకు ట్రంప్ ఫెడ్ చైర్మన్‌పై ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్ సుంకాల ఆందోళన మధ్య బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గురువారం ప్రధా వడ్డీ రేట్లతో పావుశాతం తగ్గించడంతో 4.25శాతానికి చేరింది. అయితే, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చివరిసారిగా గతేడాది డిసెంబర్లో వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే, ఇటీవల ఫెడ్ చైర్మన్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ట్రంప్ ఆర్థిక విధానాలకు సంబంధించిన ప్రభావం, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై సుంకాల ప్రభావం స్పష్టంగా కనిపించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించినట్లు పలు నివేదికలు తెలిపాయి. రాజకీయ నేతల ఇష్టానుసారంగా వడ్డీ రేట్లను మార్చే కేంద్ర బ్యాంకుల కారణంగా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదల, ఇతర ఆర్థిక సమస్యలుంటాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. నివేదికల ప్రకారం.. వడ్డీ రేట్ల విషయంలో జెరోమ్ పావెల్ నిర్ణయాలతో డొనాల్డ్ ట్రంప్ సంతోషంగా లేరని, దాంతో ఆయనను తొలగించాలని భావిస్తున్నారు. అయితే, ఫెడ్ చైర్మన్‌ను నేరుగా తొలగించే హక్కు అధ్యక్షుడికి లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై వాల్ స్ట్రీట్‌లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ వివాదంపై ఫెడరల్ రిజర్వ్‌ను స్పందన కోరింది. ఈ విషయంలో చెప్పేందుకు ఏమీ లేదని తెలిపింది.