వాషింగ్టన్, జూలై 5: తన చిరకాల పంతాన్ని నెగ్గించుకుంటూ పన్నుల తగ్గింపు, ఖర్చుల కోతకు ఉద్దేశించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. వైట్ హౌస్‌లో రిపబ్లికన్ లెజిస్లేచర్లు, సభ్యుల సందడి మధ్య ట్రంప్ ఈ బిల్లుపై సంతకం పెట్టారు. పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణకు ఈ బిల్లును తెచ్చారు. అయితే ఈ బిల్లు కారణంగా ఎన్నారైలు 2026 నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 1 శాతం పన్ను పడనుంది. ఎన్నారైలు పంపే డబ్బును బదిలీ చేసేందుకు అయ్యే ఖర్చూ ఎక్కువ కానుంది. అమెరికా చరిత్రలోనే మా ప్రభుత్వం అతి పెద్ద పన్ను కోత, వ్యయ కోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని ట్రంప్ ప్రకటించారు.
యూఎస్‌లో ఉద్యోగ, వ్యాపారాలు చేస్తూ డాలర్లను ఆర్జించే అమెరికాయేతర పౌరులు తమ దేశాలకు పంపే డబ్బుపై పన్ను విధించడాన్నే రెమిటెన్స్ ట్యాక్స్‌గా పేర్కొంటారు. ప్రపంచంలో అత్యధిక రెమిటెన్స్‌లు స్వీకరించే భారత దేశం 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెమిటెన్స్‌లలో 28 శాతం అమెరికా నుంచే 33 బిలియన్ల డాలర్లను అందుకుంది. దీంతో ఈ మొత్తానికి ఇక నుంచి 1 శాతం పన్ను చెల్లించాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడనుంది.
ఈ బిల్లు ద్వారా ఎన్నారైలపై విధించే రెమిటెన్స్ ట్యాక్స్ ద్వారా అమెరికాకు కేవలం ప్రవాస భారతీయుల ద్వారానే రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది.
2026లో అమలులోకి రానున్న రెమిటెన్స్ బిల్లు ద్వారా భవిష్యత్తులో తమ కుటుంబాలకు డబ్బు పంపాలనుకునే ప్రవాస భారతీయులు ఆ మేరకు తమ ఆర్థిక ప్రణాళికలను సవరించుకోవాల్సి ఉంది. ప్రస్తుత బిల్లులో అద్దె ఆదాయం, ఆస్తి యాజమాన్య హక్కుకు సంబంధించి అమెరికాలో అమలవుతున్న పన్ను నిబంధనలలో ఎలాంటి మార్పులు తేలేదు. ఎన్నారైలు భారత్‌లోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను యథాప్రకారం కొనసాగించవచ్చునని మరో పన్ను నిపుణులు అంకిత్ జైన్ తెలిపారు. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటంటే తాము పంపిన మొత్తంలో ఒక శాతం తగ్గుదల మాత్రమేనని పేర్కొన్నారు. శ్రామిక కుటుంబాలకు తీవ్ర అన్యాయం చేసే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలపడాన్ని విపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా నిరసించారు.
ప్రవాస భారతీయులపై ఎక్కువ ప్రభావమే చూపనుంది. ఇది ఒక్క శాతమే అయినా భారత్‌కు ఎన్నారైలు పంపే డబ్బును బదిలీ చేసేందుకు అయ్యే ఖర్చులు ఎక్కువ కానున్నాయి. అయితే ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నిర్ధారిత యూఎస్ బ్యాంకుల ద్వారా జరిపే నగదు బదిలీలను దీని నుంచి మినహాయించారు. అంటే ఈ విధానంలో డబ్బును బదిలీ చేసిన వారిపై ఆ పన్ను ఉండదు. కాబట్టి బదిలీ చార్జీల నుంచి తప్పించుకోవడానికి ప్రవాస భారతీయులు ఈ మార్గాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.