US Pilot | ఓ తొమ్మిదేళ్ల బాలిక పోగొట్టుకున్న బొమ్మను తిరిగి ఇచ్చేందుకు ఓ పైలట్ (Pilot ) ఏకంగా వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. చివరికి ఆ బొమ్మను తిరిగిచ్చి చిన్నారి ముఖంలో చిరునవ్వుని నింపాడు.
అమెరికా టెక్సాస్ (Texas)కు చెందిన రూడీ డొమింగుజ్ (Rudy Dominguez) తన కుటుంబంతో కలిసి ఇటీవలే ఇండోనేషియా పర్యటకు (Indonesia Trip) వెళ్లాడు. అతడి తొమ్మిదేళ్ల కుమార్తె వాలెంటీనా (Valentina ).. తనకు ఎంతో ఇష్టమైన బొమ్మ (బీట్రైస్)ను వెంట తీసుకెళ్లింది. అయితే, ట్రిప్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఆ బొమ్మ కనిపించలేదు. బొమ్మ దొరుకుతుందని చిన్నారి తల్లిదండ్రులు ఇంటితోపాటు.. తమ వెంట ట్రిప్‌కు తీసుకెళ్లిన లగేజీ మొత్తం వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ చిన్నారి చాలా దిగులు చెందింది. రోజులు గడుస్తున్నా ఆ పాప బొమ్మ గురించే ఆలోచిస్తూ ఉంది. చిన్నారి బాధను ఆమె తల్లిదండ్రులు చూడలేకపోయారు. టోక్యో (Tokyo) విమానాశ్రయంలో చిన్నారి వద్ద చివరిసారిగా బొమ్మను చూసినట్లు గుర్తుచేసుకున్నారు. ఇక దాన్ని పొందేందుకు ఏదైనా మార్గం దొరుకుతుందన్న ఆశతో బొమ్మ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. బొమ్మ ఫొటోను షేర్ చేస్తూ.. ‘గత నాలుగేళ్లుగా బీట్రైస్ (Beatrice ) మా జీవితంలో భాగమైపోయింది. అది పోగొట్టుకున్నందుకు మా పాప చాలా బాధపడుతోంది’ అంటూ వాలెంటీనా తండ్రి రూడీ డొమింగుజ్ పోస్ట్ పెట్టాడు.
అదృష్టవశాత్తూ అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines)కి చెందిన పైలట్ (Pilot) జేమ్స్ డానెన్ (James Danen) ఆ పోస్ట్ చూసి ఆ బొమ్మ వివరాలను ఫోన్ ద్వారా వారిని అడిగి తెలుసుకున్నాడు. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో తప్పిపోయిన ఆ బొమ్మను ఎట్టకేలకు కనిపెట్టాడు. టర్కీ నుంచి టెక్సాస్‌కు ఏకంగా 5,880 మైళ్లు (9462 కిలోమీటర్లు) ప్రయాణించి.. బీట్రైస్ను ఆ చిన్నారికి అందించాడు. దీంతో ఆ చిన్నారి ఆనందంతో ఎగిరి గంతేసింది. దీనిపై జేమ్స్ మాట్లాడుతూ.. ‘ఇది నా స్వభావం. ప్రజలకు సహాయం చేయడం నాకు చాలా ఇష్టం. అదే నేను చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా మంచి చేయడం నాకు సంతోషాన్నిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను తిరిగి పొందినందుకు వాలెంటీనా కూడా చాలా సంతోషించింది. ‘బీట్రైస్ అంటే నాకు చాలా ఇష్టం. అది నాకు ఆనందాన్ని ఇస్తుంది. నా బెస్ట్ ఫ్రెండ్. బొమ్మ పోగొట్టుకున్నందుకు నేను చాలా బాధపడ్డా’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read..
Rishabh Pant | గ్రిప్.. ట్విస్ట్.. పాడిల్.. రిషబ్ పంత్ సైక్లింగ్ వీడియో వైరల్
Amazon | ఇకపై ఆఫీసుకు రావాల్సిందే, లేదంటే.. ఉద్యోగులకు అమెజాన్ గట్టివార్నింగ్