బుధవారం 27 మే 2020
International - Apr 07, 2020 , 12:14:10

నావికులను కాపాడిన కెప్టెన్‌కు తిట్లు.. ఆ తర్వాత సారీ

నావికులను కాపాడిన కెప్టెన్‌కు తిట్లు.. ఆ తర్వాత సారీ

హైదరాబాద్: విశ్వవ్యాప్తంగా కరోనా తెచ్చిపెడుతున్న తంటాలు ఇన్నీఅన్నీ కావు. అమెరికాకు న్న బారీ విమానవాహక యుద్ధనౌకల్లో థియోడోర్ రూజ్‌వెల్ట్ ఒకటి. ఆ నౌకలోని నావికులకు ఇటీవల కరోనా సోకింది. దాంతో కెప్టెన్ బ్రెట్ ఈ కోజియర్ పైవాళ్లకు సహాయం కోసం మెమో పంపారు. నావికులను బలిపెట్టాల్సిన తరుణం కాదని హడావిడిగా పంపిన ఆ మెమోలో మొరపెట్టుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఆయన విజ్ఞప్తి మేరకు నావికులను చికిత్స నిమిత్తం నౌక నుంచి తీరంలోని ఆస్పత్రికి తరలించింది. అంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత కోజియర్‌ను అమెరికా తాత్కాలిక నేవీ సెక్రెటరీ థామస్ మాడ్లీ నౌక కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించారు. తమను కాపాడే ప్రయత్నంలో కెప్టెన్ బలికావడం నౌకలోని సిబ్బందికి నచ్చలేదు. కెప్టెన్ కోజియర్ విధుల నుంచి వైదొలగి నౌక నుంచి దిగి వెళుతున్నప్పుడు సిబ్బంది డెక్ మీద చేరి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇదిలాఉంటే సెక్రెటరీ మాడ్లీ కెప్టెన్ కరోజియర్ ను బుద్దిలేనివాడు, వెర్రిబాగులవాడు అని తీవ్ర పదజాలంతో విమర్శించారు. కరోనా విషయంలో సరిగా వ్యవహరించలేదని మండిపడ్డారు. ఈ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో సంచలనం సృష్చించింది. పలువురు సెనేటర్లు నేవీ సెక్రెటరీ తీరును తప్పుబట్టారు. కొందరైతే సెక్రెటరీ చర్య నేరపూరతంగా ఉందని దుయ్యబట్టారు. దాంతో సెక్రెటరీ మాడ్లీ మాటమార్చారు. కెప్టెన్ కోజియర్ తన నావికులను కాపాడుకునే ఆత్రుతలో చేసింది ఏదీ తప్పుకాదని, ఆయన తెలివైనవారని మెచ్చుకున్నారు. కోజియర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పుకున్నారు. అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల అన్నట్టుగా తయారైంది అంతా.


logo