టెహ్రాన్, ఏప్రిల్ 7: ఇరాన్ వ్యూహాత్మక చమురు కేంద్రమైన ఖర్గ్ ద్వీపంలోని 50 సైనిక లక్ష్యాలపై అమెరికా సైన్యం మంగళవారం దాడి చేసినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చుకోవడానికి ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు మంగళవారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటలు) ముగియడానికి కొన్ని గంటల ముందు ఈ దాడులు జరిగినట్లు ఇరాన్‌కు చెందిన పాక్షిక అధికారిక మెహర్ వార్తా సంస్థ మొదటగా తెలియచేసింది.
తన కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్ తిరస్కరించినందుకు తాను చాలా కలత చెందానని ప్రకటించి ఒప్పందం కుదుర్చుకోవడంలో ఇరాన్ విఫలమైన పక్షంలో భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయి. అయితే ఇరాన్ మాత్రం విస్తృత షరతులతో కూడిన శాశ్వత యుద్ధ ముగింపును డిమాండ్ చేస్తున్నది. ఒప్పందానికి రాకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని కూడా ట్రంప్ ఇరాన్‌ని హెచ్చరించారు.
ఇరాన్‌లోని ప్రధాన రవాణా మౌలిక సదుపాయాలపై మంగళవారం యూఎస్-ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపాయి. రెండు రైలు వంతెనలు, ఒక రైల్వే స్టేషన్ సహా నాలుగు రైల్వే ఆస్తులతో పాటు ఒక ప్రధాన హైవేను ధ్వంసం చేశాయి. హోలీసిటీ కామ్ నగరంలోని ఒక వంతెనతో పాటు కాషన్లోని ఒక రైలు వంతెనను కూల్చివేశాయి. కాషన్లో ఇద్దరు పౌరులు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఖాజ్విన్, జంజన్, కారజ్, కాషన్లలో ప్రధాన రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. దాడులకు ముందు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఇరాన్ పౌరులకు ఒక హెచ్చరిక చేసింది. రానున్న 12 గంటల్లో రైళ్లు ఎక్కవద్దని, దేశంలో ఎక్కడా రైలు ప్రయాణం చేయవద్దని, రైల్వే లైన్ల వద్దకు వెళ్లవద్దని, అలా చేస్తే ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పౌరులను హెచ్చరించింది. దీంతో మహ్షద్, ఇతర మెట్రోపాలిటిన్ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇజ్రాయెల్ హెచ్చరికతో మష్హాద్‌లో ముందు జాగ్రత్తగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు, ఇరాన్‌లోని అల్బోర్జ్ ప్రావిన్స్ లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 18 మంది పౌరులు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. అయితే శత్రువులు దేనిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారో తెలియరాలేదని స్థానిక మీడియా తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై, పర్వతాలలోని ఆయుధగారం, నివాస ప్రాంతాలు సహా పలుచోట్ల తీవ్రమైన దాడులు జరిగాయి. అలాగే షిరాజ్‌లోని ఒక ఇరాన్ పెట్రో కెమికల్ స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. పశ్చిమ ఇరాన్‌లోని ఖొర్రమాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా దాడి జరిగింది.
సౌదీ అరేబియాపై ఇరాన్ ఏడు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఎనర్జీ సౌకర్యాలపై జరిగిన ఈ దాడిని తాము సమర్థంగా తిప్పికొట్టామని, దీంతో అక్కడ శకలాల వర్షమే కురిసిందని అధికారులు తెలిపారు. ఈ దాడిలో సౌదీ అరేబియా కింగ్ఫహద్ కాజ్‌వేను తాత్కాలికంగా మూసివేసింది. కాగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, ఇలాట్ల పైకి కూడా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్లో 1,900 మందికి పైగా పౌరులు మరణించారు.