టెహ్రాన్/ వాషింగ్టన్, జూన్ 28: పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. శాంతి ఒప్పందంపై సంతకాలు చేసి రెండు వారాలు కూడా గడువక ముందే ఇరు దేశాలు ఒకరిపై ఒకరు నిందలు చేసుకుంటూ మళ్లీ దాడులకు తెరతీశాయి. హొర్ముజ్ జలసంధిలో పనామా దేశ పతాకంతో వెళ్తున్న ఎం/వీ ఎవర్ లవ్లీ అనే నౌకపై ఇరాన్ దాడి చేయడంతో తాము స్పందించి ఇరాన్‌పై దాడులు చేసినట్టు యూఎస్ మిలిటరీ ప్రకటించింది. 10 సైనిక లక్ష్యాలపై దాడులు చేశామని తెలిపింది. ఇరాన్ సైనిక నిఘా వ్యవస్థలు, సమాచార ప్రసార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున అమెరికా దాడులు చేసింది. యూఎస్ దాడులకు కువైట్, బహ్రెయిన్‌లపై ఇరాన్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా తమ బలగాలు కువైట్‌లోని అలీ-అల్-సేలమ్ లోని 8 అతి ముఖ్యమైన అమెరికా సైనిక స్థావరాలను నాశనం చేశాయని, బహ్రెయిన్, పోర్ట్ సల్మాన్‌లోని ఐదవ నౌకాదళ స్థావరాన్ని కూడా దెబ్బతీశాయని టెహ్రాన్ తెలిపింది. కాగా, తమ దేశంపై ఇరాన్ దాడిని బహ్రెయిన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమత్వాన్ని బహిరంగంగా ఉల్లంఘించే ఇరాన్ చర్య గర్హనీయమని పేర్కొన్నది.
నరకం చూడటానికి సిద్ధంగా ఉండండి
ఇరాన్ లక్ష్యంగా అమెరికా జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా తమ నావికా, వైమానిక దళాలు సంయుక్తంగా క్షిపణి, డ్రోన్ ఆపరేషన్ ప్రారంభించాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) హెచ్చరించింది. సిరిక్‌పై అమెరికా జరిపిన దాడులు హొర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను బలహీనపర్చదని తీవ్ర పదజాలంతో ఐఆర్జీసీ ప్రకటన విడుదల చేసింది. ‘మీరు మా సార్వభౌమాధికారంపై దాడి చేశారు. ఇక పరిస్థితుల్ని మార్చే కార్యాచరణకు సిద్ధంగా ఉండండి, మీరు తప్పుగా అంచనా వేశారు. మా సహనం నశించింది. కాళరాత్రి తప్పదు. అన్ని హద్దులూ దాటారు. నరకం చూడటానికి సిద్ధంగా ఉండండి. మా నిర్ణయం మాటలకే పరిమితం కాదు.. కొన్ని గంటల్లో మా శక్తిని చూపిస్తాం’ అని హెచ్చరించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా పూర్తిగా ఉల్లంఘించిందని ఐఆర్జీసీ ఆరోపించింది. ఇస్లామాబాద్ ఎంవోయూని ఉల్లంఘిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్యపరమైన ప్రక్రియలన్నీ నిలిచిపోతాయని హెచ్చరించింది.
ఇస్లామిక్ రిపబ్లిక్ మొత్తాన్ని నాశనం చేస్తాం
ఇస్లామిక్ రిపబ్లిక్ మొత్తాన్ని నాశనం చేస్తానని ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో ఆదివారం పోస్ట్ పెడుతూ వరుసగా రెండో రోజు కూడా తమ దళాలు ఇరాన్‌పై దాడులు చేసిన విషయాన్ని నిర్ధారించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించిన ఇరాన్ క్షిపణి, డ్రోన్ల నిల్వ కేంద్రాలు, కోస్తా రాడార్ స్థావరాలపై తమ వైమానిక దళం దాడి చేసినట్టు తెలిపారు. ‘ఒక దశలో మనం హేతుబద్ధంగా వ్యవహరించ లేని పరిస్థితి రావచ్చు. అప్పుడు మనం ఎంతో విజయవంతంగా ప్రారంభించిన పనిని సైనికపరంగా పూర్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడవచ్చు’ అని ట్రంప్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒక వేళ అలా జరిగితే ఇక ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అన్న దేశం ఉనికిలో ఉండదు అని ఆయన హెచ్చరించారు.
30 రోజులు ఇరాన్ ఆధీనంలోనే హొర్ముజ్
రానున్న 30 రోజుల పాటు హొర్ముజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ ఆధీనంలోనే ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. హొర్ముజ్కు సంబంధించిన ఎలాంటి సవాళ్లు అయినా ఉద్రిక్తతను మరింత పెంచుతాయని అన్నారు. బాగ్దాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అక్కడ ఉన్న అడ్డంకులన్నీ తొలగించిన తర్వాత జలమార్గం పూర్తి సామర్థ్యాన్ని పునరిద్ధరించనున్నట్టు తెలిపారు. దీని పూర్తి బాధ్యత ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్దేనని స్పష్టం చేశారు.