India tariffs | భారత్ ఎగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సుంకాల్ని అమెరికా తగ్గించే యోచనలో ఉంది. దీనికి కారణం.. రష్యా నుంచి ఇటీవల చమురు కొనుగోళ్లను ఇండియా తగ్గించడమే. రష్యా నుంచి చమురు దిగుమతుల్ని ఇండియా తగ్గించిన నేపథ్యంలో టారిఫ్ లు 25 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించే ఆలోచన ఉందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ అన్నారు.
ఈ అంశాన్ని ట్రంప్ నాయకత్వం పరిశీలిస్తోందన్నారు. అమెరికాలోని ఒక మీడియా సంస్థతో స్కాట్ మాట్లాడారు. ఆయిల్ దిగుమతుల్ని ఇండియా తగ్గించుకోవడం హర్షించదగిన చర్య అన్నారు. భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతోనే ట్రంప్ మనపై టారిఫ్ లు పెంచాడు. అలాగే, రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వ్యత్యాసాల కారణంగా కూడా టారిఫ్ లు పెంచాడు. రష్యా ఆయిల్ కొనడం ఇండియా తగ్గిస్తేనే టారిఫ్లు తగ్గిస్తామని ట్రంప్ హెచ్చరించాడు. అయితే, వివిధ కారణాల వల్ల ఇటీవల ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలును స్వల్పంగా తగ్గించింది. దీంతో తమ ఒత్తిడి ఫలించిందని, టారిఫ్ ల పెంపు మంత్రం పనిచేసిందని అమెరికా అంటోంది.
టారిఫ్లు ప్రస్తుతం అమలవుతున్నాయని, కానీ, వాటిని తగ్గించేందుకు మార్గం దొరికిందని స్కాట్ అన్నారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ (ఈయూ) మాత్రం ఇండియాపై టారిఫ్లు విధించకపోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ఇండియాతో భారీ ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు ఈయూ ప్రయత్నించడం వల్లే టారిఫ్లు లేవని స్కాట్ అన్నారు.