Iran vs US : వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో శనివారం రాత్రి కూడా అమెరికా సైన్యం (US Army) ఇరాన్ (Iran) లక్ష్యాలపై భారీ దాడులు జరిపింది. ఇరాన్‌కు చెందిన నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, గగనతల రక్షణ స్థావరాలు, డ్రోన్ గిడ్డంగులు, సముద్రపు మైన్లను అమర్చే సామర్థ్యాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. పనామా పతాకం (Panama flag) తో ప్రయాణిస్తున్న ‘కికు (Kiku)’ అనే ముడిచమురు నౌక (Crude oil ship) పై ఇరాన్ డ్రోన్ దాడి (Drone attack) కి పాల్పడిన నేపథ్యంలో అమెరికా సెంట్రల్ కమాండ్ (Centcom) ఈ ప్రతీకార చర్యలు చేపట్టిందని ఆమెరికా పేర్కొన్నది.
అమెరికా సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. 20 లక్షల బ్యారెళ్లకుపైగా ముడిచమురుతో ప్రయాణిస్తున్న ‘కికు’ నౌక హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడికి గురైంది. ఈ దాడిలో నౌకలోని సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని, పర్యావరణానికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లలేదని ప్రాథమిక నివేదికలు స్పష్టంచేశాయి. ఈ నౌక ఖతార్ చమురు క్షేత్రం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రేవుకు వెళ్తుండగా దాడి జరిగింది. ఇరాన్ చర్యలపై తీవ్రంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దాడులకు ఆదేశించారు. ఇరాన్ గనుక పద్ధతి మార్చుకోకపోతే ఆ దేశ ఉనికి ప్రమాదంలో పడుతుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ ఏవైనా విభేదాలు ఉంటే హింస ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరాన్‌కు సూచించారు. కాగా గత రెండు రోజుల్లో అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి. అంతకుముందు శుక్రవారం ‘ఎవర్ లవ్లీ’ అనే మరో వాణిజ్య నౌకపై జరిగిన దాడికి ప్రతిస్పందనగా కూడా ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు చేసింది. దీనికి ప్రతికారంగా తాము కూడా ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. తాజా ఉద్రిక్తతలతో ఉభయ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రమాదంలో పడింది. ప్రపంచ ముడిచమురు రవాణాకు జీవనాడి లాంటి హర్మూజ్ జలసంధిలో రాకపోకల రుసుములు, సురక్షిత మార్గాలపై వివాదాలు మరింత ముదిరాయి.