US-Iran : ప్రపంచ దేశాలకు ఇదో గుడ్ న్యూస్. కొద్ది రోజులుగా మూసి ఉన్న హార్ముజ్ జలసంధి త్వరలోనే తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం.. హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై గురువారం రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
హార్ముజ్‌ను వీలైనంత త్వరగా, దశలవారీగా అందుబాటులోకి తేవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే హార్ముజ్ విషయంలో పూర్తి ఒప్పందం కుదిరి, జలసంధి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే, ఇక్కడ చిక్కుకుపోయిన నౌకల్ని కూడా ప్రయాణించేందుకు అనుమతివ్వనున్నారు. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి హార్ముజ్ మూసి ఉన్న సంగతి తెలిసిందే. మధ్యలో కొన్ని గంటలు మాత్రమే హార్ముజ్‌ను ఇరాన్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత వెంటనే తిరిగి మూసేసింది. అనంతరం అమెరికా కూడా ఈ జలసంధిని దిగ్బందించింది. ఈ మధ్య కాలంలో కొన్ని నౌకలకు మాత్రం అనుమతి లభించింది.
ఇక, ఇక్కడ చిక్కుకుపోయిన నౌకల్ని విడిపించేందుకు అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాణిజ్య నౌకలకు రక్షణగా, అమెరికా యుద్ధ విమానాల్ని మోహరించాలనుకుంది. కానీ, ఇరాన్‌తో చర్చల్లో ముందడుగు పడటంతో ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ఆపేస్తున్నట్లు అమెరికా తెలిపింది. మరోవైపు ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ జలసంధి అందుబాటులోకి వస్తే అంతర్జాతీయంగా చమురు అందుబాటులోకి వస్తుంది.