వాషింగ్టన్: ఎస్-400 మిస్సైళ్లను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ డీల్‌పై అమెరికా ప్రభుత్వం ఇన్నాళ్లూ కన్నెర్ర చేసింది. సీఏఏటీఎస్ఏ ఆంక్షలను అమలు చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు రష్యా నుంచి ఎస్-400 మిస్సైళ్లను కొనుగోలు చేసే విషయంలో అమెరికా నుంచి దాదాపు లైన్ క్లియర్ అయినట్లు స్పష్టమవుతోంది. భారత్‌పై విధించిన సీఏఏటీఎస్ఏ ఆంక్షలను ఎత్తివేయాలని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు ఆమోదం దక్కింది. ఈ సవరణ బిల్లును భారత సంతతి ప్రతినిధి రో ఖన్నా ప్రవేశపెట్టారు. దూకుడుమీదున్న చైనాను అడ్డుకోవాలంటే భారత్‌కు ఉపశమనం కలిగించే రీతిలో ఈ సవరణ అవసరమని ఆయన అన్నారు. అయితే మూజువాణి ఓటు ద్వారా ఈ సవరణకు ఆమోదం దక్కింది. రష్యా నుంచి రక్షణ సంబంధింత హార్డ్‌వేర్ కొనుగోలుపై ఆంక్షలు విధించించే రీతిలో సీఏఏటీఎస్ఏ చట్టాన్ని అమెరికా రూపొందించుకున్నది.
ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు రష్యాతో ఇండియా 5 బిలియన్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే ఆ డీల్ కొనసాగితే, తమతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నట్లు అప్పట్లో అమెరికా హెచ్చరించింది. కానీ ఇండియా మాత్రం వెనక్కి తగ్గలేదు. రష్యాకు చెందిన ఎస్-400 మిస్సైళ్లు.. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్ల రక్షణ వ్యవస్థలో మోస్ట్ అడ్వాన్స్డ్ ఆయుధాలు.