వాషింగ్టన్: అమెరికా షట్‌డౌన్ ప్రకటించింది. సేనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు ఆమోదం దక్కలేదు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం 11.59 నిమిషాల వరకు ఆ బిల్లు క్లియరెన్స్ కోసం ఎదురుచూశారు. కానీ డెమోక్రాట్లు తగ్గకపోవడంతో.. ట్రంప్ సర్కారు షట్‌డౌన్ ప్రకటించింది. ఫండింగ్ బిల్లు సేనేట్‌లో పాస్ కాకపోవడం వల్ల నిరవధికంగా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు వైట్‌హౌజ్ పేర్కొన్నది. గడిచిన ఏడేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. షట్‌డౌన్ ప్రకటించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు తాత్కాలికంగా విధులకు దూరం కావాల్సి ఉంటుంది.
పెద్దల సభ సేనేట్‌లో రిపబ్లికన్ పార్టీకి కేవలం 54 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఫండింగ్ బిల్లుకు ఆమోదం దక్కాలంటే 60 ఓట్లు తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలో తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు డెమోక్రాట్లు ఫండింగ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయలేదు. బిల్లుకు అనుకూలంగా 55 ఓట్లు, వ్యతిరేకంగా 45 ఓట్లు పోలయ్యాయి. దీంతో బిల్లు పాస్ కాలేకపోయింది. ఆరోగ్య సబ్సిడీల గురించి డెమోక్రాట్లు పట్టపట్టారు. ఆ అంశంపై సుదీర్ఘంగా చర్చించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రీమియంలు పెంచుతున్నట్లు వస్తున్న నోటీసులపై ఆందోళన వ్యక్తం చేశారు. మెడిక్ ఎయిడ్ కోతల అంశంలో రిపబ్లికన్లు వెనక్కి తగ్గాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
2018 తర్వాత ప్రభుత్వాన్ని షట్‌డౌన్ చేయడం ఇదే మొదటిసారి. తాజా పరిస్థితితో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం లేని లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది. అనేక ప్రభుత్వ పథకాలు, సేవలను నిలిపివేయాల్సి వస్తుంది. సేనేట్‌లో రిపబ్లికన్లకు కంట్రోల్ ఉన్నా.. బిల్లును పాస్ చేయించుకోలేకపోయారు.