కీవ్: అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ ఆదివారం ఉక్రెయిన్లో ఆకస్మికంగా పర్యటించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే యుద్ధ భూమికి వచ్చిన ఆమె ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భార్య, ఆ దేశ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కీని కలిశారు. రష్యా దాడి నేపథ్యంలో ఊహించని పర్యటనతో ఆ దేశానికి తన సంఘీభావాన్ని, అమెరికా మద్దతును తెలియజేశారు.
ఆదివారం స్లోవేకియాలో పర్యటించిన జిల్ బైడెన్ అక్కడ ఆశ్రయం పొందుతున్న ఉక్రెయిన్ మహిళలను కలిశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో స్లోవేకియా సరిహద్దు గ్రామం నుంచి పది నిమిషాలు ప్రయాణించి ఉక్రెయిన్లోని ఉజ్హోరోడ్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడి స్కూల్ క్లాస్ రూమ్లో ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కీతో ఆమె సమావేశమయ్యారు. వారిద్దరు కొంత సేపు విడిగా మాట్లాడుకున్నారు.
సుమారు రెండు గంటలపాటు ఉక్రెయిన్లో ఉన్న జిల్ బైడెన్ ఆ దేశంపై రష్యా యుద్ధం క్రూరమైందని ఆరోపించారు. ఈ యుద్ధం ఆగిపోవాలని ఆంకాంక్షించారు. ఉక్రెయిన్ ప్రజల వెంట అమెరికా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందుకే మదర్స్ డే రోజున ఉక్రెయిన్ను సందర్శించినట్లు ఒలెనాతో అన్నారు.
జిల్ బైడెన్ ఉక్రెయిన్ పర్యటన ధైర్యంతో కూడినదని ఒలెనా జెలెన్స్కీ కొనియాడారు. ‘రోజూ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా ప్రథమ మహిళ ఇక్కడకు ఎందుకు వచ్చారో మాకు అర్థమైంది. మీ మద్దతు, అమెరికా అధ్యక్షుడి నాయకత్వం గురించి మాకు తెలుసు. ఈ మదర్స్ డే మాకు చాలా ప్రతీకాత్మకమైన రోజు. ఇలాంటి ముఖ్యమైన రోజున మీ ప్రేమ, మద్దతును మేం పొందుతున్నాం’ అని అన్నారు.
కాగా, యుద్ధం నేపథ్యంలో తన పిల్లలతో రహస్య ప్రాంతంలో ఉంటున్న ఒలెనా జెలెన్స్కీ తొలిసారి మీడియా ముందు కనిపించారు. మరోవైపు మదర్స్ డేతోపాటు రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ లొంగిపోయినందుకు గుర్తుగా ప్రతి ఏటా మే 8న జరుపుకునే విక్టరీ డే రోజున అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఉక్రెయిన్లో ఆకస్మికంగా పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
The moment First Ladies Jill Biden 🇺🇸 and Olena Zelenska 🇺🇦met today in Uzhhorod, Ukraine pic.twitter.com/9UsdBBA6Eh
— Michael LaRosa (@MichaelLaRosa46) May 8, 2022
This Mother’s Day, I wanted to be with Ukrainian mothers and their children.
Over the last few months, far too many Ukrainians have had to flee their homes – forcing them to leave behind their loved ones. pic.twitter.com/zjtMv5ey0B
— Jill Biden (@FLOTUS) May 8, 2022