IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ కోసం ఆటగాళ్లను అట్టిపెట్టుకునే గడువు సమీపిస్తు వేళ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ (Kane Williamson)ను వ్యూహాత్మక సలహాదారుగా తీసుకున్న లక్నో.. ఈసారి ఆస్ట్రేలియా దిగ్గజానికి పెద్ద బాధ్యతలు అప్పగించింది. పొట్టి ఫార్మాట్లో, ఐపీఎల్లో కోచ్‌గా సుదీర్ఘ అనుభవం కలిగిన టామ్ మూడీ (Tom Moody)ని తమ ఫ్రాంచైజీ ‘గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ (Global Director Of Cricket)గా నియమించింది లక్నో. ఈ విషయాన్ని మంగళవారం ఫ్రాంచైజీ అధికారికంగా ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఊహించినట్టుగానే టామ్ మూడీని తమ గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించుకుంది లక్నో ఫ్రాంచైజీ. ‘ఐపీఎల్లో సుదీర్ఘ అనుభవం, దూరదృష్టి, సమర్ధ నాయకత్వం .. ఈ లక్షణాలన్ని కలగలిసిన టామ్ మూడీకి లక్నో సూపర్ జెయింట్స్ ప్రపంచంలోకి స్వాగతం. ఇకపై అతడు వ్యూహాత్మక నిర్ణయాలు, ఆటగాళ్ల వేలం, ఆటగాళ్ల రిటెన్షన్, ప్రతిభావంతులను వెలికితీయడం వంటి కీలక బాధ్యతల్ని చూసుకోనున్నాడు’ అని పోస్ట్‌లో పేర్కొంది. 19వ సీజన్ కోసం క్రికెటర్లను అట్టిపెట్టుకునేందుకు నవంబర్ 15 చివరి తేదీ. సో.. ఇప్పుడు మూడీ ముందున్న పెద్ద టాస్క్.. ఎవరిని వదిలేయాలి? డిసెంబర్లో జరుగబోయే వేలంలో ఎవరిని కొనాలి? అనే విషయాలపై కసరత్తు చేయడమే.
Experience. Vision. Leadership. 🫡
Welcome aboard the Super Giants Universe, Tom Moody! 💙 pic.twitter.com/DofUZopQpx
— Lucknow Super Giants (@LucknowIPL) November 4, 2025
తనకు లక్నో ఫ్రాంచైజీ పెద్ద బాధ్యతలు అప్పగించడం పట్ల మూడీ సంతోషం వ్యక్తం చేశాడు. ‘లక్నో సూపర్ జెయింట్స్ గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. సంజీవ్ గోయెంకాతో సానుకూల చర్చలు ముగిసిన అనంతరం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నా. ఫ్రాంచైజీ జట్లకు ఒకేరకమైన క్రికెట్ ఫిలాసఫీని అలవాటు చేయాలనుకుంటున్నా. ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేసేలా చూడడంతో పాటు విజయపరంపరను కొనసాగించేలా ప్రణాళికలు వేస్తాను. కెప్టెన్, కోచ్‌లు, మేనేజ్మెంట్తో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఉన్నాను’ అని మూడీ తెలిపాడు.
From strategy to success, the journey begins 🙌
Here’s to new beginnings, Tom Moody! 💙 pic.twitter.com/NZElJO4AbO
— Lucknow Super Giants (@LucknowIPL) November 4, 2025
లక్నో గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా మూడీ సిస్టర్ ఫ్రాంఛైజీల వ్యవహారాలు చూసుకోనున్నాడు. ఐపీఎల్‌తో పాటు ఎస్ఏ20లోని లక్నో సూపర్ జెయింట్స్, ది హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఫ్రాంచైజీ కూర్పు, ఆటగాళ్ల ఎంపిక వంటివి ఇకపై మూడీ కనుసన్నల్లోనే జరుగనున్నాయి. పొట్టి క్రికెట్లో టామ్ మూడీ ట్రాక్ రికార్డు గొప్పగా ఉంది. ఈమధ్యే ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ఓవల్ ఇన్విసిబుల్స్ జట్టును మూడోసారి విజేతగా నిలిపాడు. అలానే ఇంటర్నేషనల్ 20లీగ్‌లో డెజర్ట్ వైపర్స్‌ను రెండుసార్లు ఫైనల్ చేర్చాడీ ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్.
ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. వరుసగా రెండుసీజన్లు ప్లే ఆఫ్స్ చేరిన ఎల్ఎస్జీ.. 17, 18వ సీజన్లలో నాకౌట్ దశకు ముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పద్దెనిమిదో సీజన్ వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరతో రిషభ్ పంత్‌ను కొనుగోలు చేసిన లక్నో.. అశించిన ఫలితాన్ని మాత్రం చూడలేదు. పంత్ సారథ్యంలోని ఆ జట్టు మొదట విజయాలతో అదరగొట్టింది. కానీ, చివరకు ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్ చేరలేదు.