KTR | జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుతున్నది కారుకు.. బుల్డోజర్కు మధ్యేనని, కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లపైకి బుల్డోజర్ వస్తుందని.. ప్రజలను ఆదుకునే ఎవరూ ఉండరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమాజీగూడలో రోడ్‌షో నిర్వహించిన కేటీఆర్ ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కాడని, విద్యార్థులకు ఇస్తామన్న విద్యా భరోసా కార్డు ఎక్కడికి వెళ్లింది? అంటూ నిలదీశారు. కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదన్న కేటీఆర్.. ఎస్సీ ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేద పిల్లలు చదువుకు దూరమవుతున్నారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనోడు అభివృద్ధి చేస్తానంటే నమ్మాలా? అంటూ ప్రశ్నించారు.
కొత్త పీఆర్సీ చేస్తా.. డీఏలు ఇస్తానని ఉద్యోగులను మభ్యపెట్టాడని, ఉద్యోగుల భద్రత గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని.. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకుండా రెండేళ్లుగా రేవంత్‌రెడ్డి సతాయిస్తున్నాడని.. రెండేళ్లుగా చకోర పక్షిలా ఎదురుచూస్తున్నా రేవంత్ మనసు కరుగడం లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి నడుపుతున్నది సర్కారా? రౌడీ దర్బారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రిటైర్డ్ ఉద్యోగులను, పెన్షనర్లను పట్టించుకోనోడు.. అభివృద్ధి చేస్తామంటే నమ్ముతారా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే వందలాది రైతులు, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఉపాధి కరువై 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో వేయి గురుకులాలు మూలనపడ్డాయని, ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు విద్యకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గరీబోళ్ల ఇళ్లు కూల్చుతున్న హైడ్రా పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని.. ఇళ్లు కూలగొట్టి గరీబోళ్లకు నిల్వ లేకుండా చేసిండు రేవంత్ అంటూ మండిపడ్డారు.
పిల్లలు తమ పుస్తకాలు తీసుకుంటామంటే అధికారులు కనికరించలేదన్నారు. మంత్రి పొంగులేటి, వివేక్ వంటి పెద్దల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లదు ? అంటూ నిలదీశారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుతున్నది కారుకు.. బుల్డోజర్కని.. కాంగ్రెస్ గెలిస్తే మీ ఇండ్లపైకి బుల్డోజర్ వస్తదని.. మమ్మల్ని ఆదుకునేవారు ఎవరూ ఉండరన్నారు. కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ కిట్ బంద్ అయ్యిందని, రంజాన్ తోఫా రావడం లేదని, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్ట్‌లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇన్ని బంద్ పెట్టినోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తామంటే అమ్ముతారా? అంటూ ప్రశ్నించారు కేటీఆర్, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తూ.. మొగోళ్లకు రెండితల బస్ చార్జీలు పెంచారని, కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి 20వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా ఇచ్చారని.. కాంగ్రెస్ గెలిస్తే ప్రతి ఇంటికీ నీటి బిల్లులు వస్తాయని హెచ్చరించారు. పదేళ్ల అభివృద్ధి, రెండేళ్ల అరాచకానికి జరుగుతున్న పోటీ ఇదని.. నిష్పక్షపాతంగా కొట్లాడితే ఓడిపోతామని.. దొంగ ఓట్లను రేవంత్ నమ్ముకున్నడని.. బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి, కాంగ్రెస్ రెండేళ్ల అరాచకాన్ని బేరీజు వేసుకొని కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీతో సునీతా గోపినాథ్‌ను గెలిపించాలని కోరారు.