KTR | అలవిగాని హామీలు ఇచ్చి అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారకరామారావు ఆరోపించారు. మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా సోమాజిగూడలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా ప్రజలకు అభివాదం చేస్తూ కేటీఆర్ ముందుకు సాగారు. రోడ్‌షో సందర్భంగా ఎల్లారెడ్డిగూడ, ఇమామ్‌గూడ చౌరస్తా పరిసరాలన్నీ గులాబీమయమయ్యాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రోడ్‌షోకు హాజరైన ప్రజలను చూస్తుంటే సునీతా గోపీనాథ్ గెలుపు పక్కా అని తెలుస్తోందని.. ఇక తేలాల్సింది మెజారిటీ మాత్రమేనన్నారు.
హైదరాబాద్ నగరం అమ్మలాంటిదని.. అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుందని, కల్పతరువులా అందరినీ కాపాడుకుందన్నారు. నాటి కాంగ్రెస్ హయాంలో నగరంలో ఎప్పుడుపడితే అప్పుడు పవర్ కట్లు ఉండేవని, ఖాళీ బిందెలతో తాగునీటి కోసం ధర్నాలు చేసే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. అప్పుడే పుట్టిన చంటిబిడ్డను సాదుతారో అలా రాష్ట్రాన్ని కేసీఆర్ తీర్చిద్దారని, కరెంటు సమస్య లేకుండా చూసుకున్నామని, పరిశ్రమలను అభివృద్ధి చేసుకున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇన్వర్టర్లు, జనరేటర్లు మాయమయ్యాయని.. కృష్ణా, గోదావరి నుంచి నీటిని తరలించి మంచినీటి సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రజలు వలస వచ్చారని, ఆపిల్, గూగుల్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలను ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు.
3లక్షల మంది నుంచి పది లక్షల ఉద్యోగుల స్థాయికి హైదరాబాద్‌ను తీసుకువచ్చామన్నారు. ఐటీ రంగం కళకళలాడుతూ రియల్ ఎస్టేట్ బాగా పెరిగిందని, గిగ్ వర్కర్లు, వారి పిల్లలకు వేలాది అవకాశాలు వచ్చాయన్నారు. కరెంటు సమస్య తీర్చి, పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. పదేళ్లపాటు హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కేసీఆర్ చూసుకున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో మాతో పోటీపడే పరిస్థితి లేదన్నారు. బడిలో ఉండే పిల్లను, గుడుల్లో ఉండే పూజారులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. మసీదుల్లో ఇమామ్‌లను, చర్చిల్లో ఫాదర్లకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. అత్తలకు రూ.4వేల పింఛను, కోడలికి రూ.2500 వస్తున్నాయా అంటూ అదీ లేదని.. ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తారని మోసం చేశారని ధ్వజమెత్తారు.
విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదని, రైతుబంధు రూ.10వేలు ఇస్తే తాము రూ.12వేలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టారని ఆరోపించారు. కౌలు రైతులకు సైతం రూ.10వేలు ఇస్తామని మోసం చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికి భరోసా కార్డు, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలని, మైనారిటీ సబ్ ప్లాన్ అంటూ అనేక హామీలు గుప్పించాని కేటీఆర్ గుర్తు చేశారు. అలవిగాని హామీలు ఇచ్చి అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లే కాకుండా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నారని, విద్యార్థులకు 2లక్షల ఉద్యోగులు ఇస్తామని నమ్మి కాంగ్రెస్‌ను గెలిపించారని.. ఇవాళ అదే విద్యార్థులు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు.