కీవ్: ఉక్రెయిన్ యుద్ధం(Ukraine war)లో గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 20 వేల రష్యా సైనికులు మృతిచెందినట్లు అమెరికా అంచనా వేసింది. ఈ సమయంలోనే దాదాపు 80 వేల మంది సైనికులు గాయపడి ఉంటారని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. మృతిచెందినవారిలో తూర్పు బక్ముత్ సిటీపై అటాక్ కొనసాగిస్తున్న వాగ్నర్ మెర్సినరీ కంపెనీకి చెందిన సైనికులే సగం మంది ఉంటారని అమెరికా భావిస్తోంది. బక్ముత్ సిటీని చేజిక్కించుకోవాలని గత ఏడాది నుంచి రష్యా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
బక్ముత్లోని చాలా ప్రదేశాలు రష్యా సైనికుల ఆధీనంలో ఉన్నాయి. కానీ నగరంలోని పశ్చిమ ప్రాంతం ప్రస్తుతం ఉక్రెయిన్ దళాలు చేతుల్లో ఉంది. అక్కడ రెండు దళాల మధ్య భీకర పోరు సాగుతోంది. బక్ముత్ పోరులో వీలైనంత మంది రష్యా సైనికుల్ని చంపాలని ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ వార్లో రష్యాకు చెందిన లక్ష మందికిపైగా సైనికులు మరణించిన ఉంటారని కిర్బీ తెలిపారు.
ఈ యుద్ధంలో ఉక్రెయిన్ బాధిత దేశమని, అందుకే ఆ దేశంలో ఎంత మంది సైనికులు మరణించారో చెప్పడం లేదన్నారు. రష్యా దాడికి ప్రయత్నించింది కాబట్టి ఆ దేశ సైనికుల మరణాల సంఖ్యను వెల్లడిస్తున్నట్లు కిర్బీ చెప్పారు.