వాషింగ్టన్: తమ ఎఫ్-15ఈ ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చడంతో, ఓ పైలట్‌ను వెంటనే రక్షించిన అమెరికా, మరో పైలట్‌ను రక్షించేందుకు డేరింగ్ ఆపరేషన్‌ను చేపట్టింది. పైలట్ కోసం ఓ వైపు ఇరాన్ బలగాలు, ప్రజలు జల్లెడ పడుతుండగా, వారి కండ్లు గప్పి పైలట్‌ను ఇరాన్ గడ్డ నుంచి తరలించేందుకు పెద్ద సాహసమే చేసింది. హాలీవుడ్ సినిమాను తలపించే రీతిలో 24 గంటలకు పైగా సాగిన ఈ ఆపరేషన్‌లో అదృష్టం రెండు దేశాల వైపు దోబూచులాడి చివరికి అగ్ర దేశాన్నే వరించింది. శత్రుగడ్డపై చిక్కుకున్న తమ పైలట్‌ను అమెరికా బలగాలు ప్రాణాలకు తెగించి రక్షించాయి.
అమెరికా చరిత్రలోనే అత్యంత ధైర్య సాహసాలతో కూడిన రక్షణ అపరేషన్‌గా దీనిని పేర్కొనవచ్చునని పలువురు యుద్ధ నిపుణులు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇరాన్ ఐఆర్జీసీ దళాలు ఎఫ్-15ఈ ఫైటర్ జెట్‌ను కూల్చిశాయి. దీంతో అందులో ఉన్న పైలట్, మరో పైలట్ (వెపన్ ఆఫీసర్) ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే వారిలో ఒకరిని అమెరికా ముందుగానే రక్షించింది. రెండో వ్యక్తి కోసం వందల సంఖ్యలో అమెరికా స్పెషల్ ఫోర్సెస్, డజన్ల సంఖ్యలో ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు నైరుతి ఇరాన్‌లోని పర్వత ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి.
అదే సమయంలో ఇరాన్ కూడా అమెరికా పైలట్‌ను పట్టుకునేందుకు తమ సైనిక దళాలను అప్రమత్తం చేయడమే కాక, అతడిని పట్టుకుంటే బహుమతి ఇస్తామంటూ ప్రజలకు బహిరంగంగా ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో జెట్ విమానం నుంచి బయటపడ్డ తర్వాత పైలట్ గాయపడి ఉంటారని యూఎస్ భావించింది. అతడిని వెతకడం కోసం సుశిక్షితులైన ప్రత్యేక మిలిటరీ సైనికులతో రంగంలోకి దిగిన కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ(సీఎస్ఏఆర్) టీమ్‌ను వైమానిక దళాలు అనుసరించాయి.
పైలట్ పడి ఉంటాడని భావిస్తున్న ప్రదేశంలో మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పెట్రోలింగ్ జరుపుతుండగా, శత్రు దేశంలో తక్కువ ఎత్తున ఎగిరే హెలికాప్టర్లు గాలింపు చేపట్టాయి. తొలుత ఎఫ్-15ఈ జెట్ ఏ ప్రాంతంలో కూలింది నిర్ధారణ కానప్పటికీ, అది ఏ ప్రాంతంలో పడే అవకాశం ఉందో ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొనడం యూఎస్‌కు కలిసొచ్చింది. 7 వేల అడుగుల ఎత్తున కొండ పగులులో దాగి ఉన్న వైమానికుడిని గుర్తించిన సీఐఏ, అతడి కచ్చితమైన స్థానాన్ని పెంటగాన్‌కు తెలియజేసింది. దీంతో అతడిని కాంటాక్ట్ చేసి ముందుగా అతని వద్ద ఉన్న కమ్యూనికేషన్ పరికరాలను నిలిపివేయమన్నారు.
అప్పటికే ఒక హ్యాండ్ గన్‌తో కొండల ప్రాంతంలో 24 గంటల పాటు దాక్కుని ఉన్న అతడిని రక్షించే ప్రయత్నాలు చేస్తుండగా, అదే సమయంలో ఇరాన్ దళాలు అక్కడి సమీపంలోకి రావడాన్ని గమనించిన యూఎస్ బలగాలు వారిపై దాడులు చేసి దారి మళ్లించారు. అయితే ఇక్కడే అమెరికా యుద్ధ వ్యూహాన్ని అనుసరించింది. ఒక పక్క క్రూ సభ్యుడు దొరక్కపోయినప్పటికీ, అతడు తమకు లభించాడని, సురక్షిత ప్రాంతానికి అతడిని తరలించేశామన్న వార్తను అమెరికా వ్యాప్తి చేసింది. దీంతో అతడి కోసం గాలింపు ఉద్ధృతి నిలిచిపోయింది. అదే సమయంలో ఆరుగురు సభ్యుల నేవీ సీల్ బృందం ఇరాన్ గడ్డపై దిగి రక్షించాయి. తర్వాత అతడిని తీసుకుని ఒక హెలికాప్టర్ ప్రయాణమవుతుండగా, దానిపై చిన్న చిన్న ఆయుధాలతో దాడి జరిగింది. ఈ దాడిలో సిబ్బంది స్వల్పంగా గాయపడినా అతడిని యూఎస్‌లో క్షేమంగా దించినట్టు మీడియా వెల్లడించింది.
పైలట్‌ను రక్షించే ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరి దైర్య సాహసాలను ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసిస్తూ వారిది ‘అద్భుతమైన ప్రదర్శన’ అని అభివర్ణించారు. ‘ ఇరాన్ బహుమతి ప్రకటించిన, తీవ్రంగా గాయపడిన ఎఫ్-15 అధికారిని మేం రక్షించాం.’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. ‘మేం పగటి పూట ఇరాన్‌పై ఏడు గంటల పాటు గడిపి పైలట్‌ను రక్షించాం. ఇది కూడా అసాధారణమే. వారి ధైర్య సాహసాలు, ప్రతిభ అసమానం’ అని ఆయన ప్రశంసించారు.