వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనుకున్నది సాధించారు. ట్రంప్ కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును (Big Beautiful Bill) అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం అమెరికన్ కాంగ్రెస్‌లో (US Congress) సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదంతో రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్‌కు ఘన విజయం దక్కినట్లయింది. ఓటింగ్ సందర్భంగా ఇద్దరు రిపబ్లికన్ సభ్యులు కూడా డెమోక్రాట్లకు అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. సెనేట్, ప్రతినిధుల సభ ఆమోదంతో బిల్లును అధ్యక్షుడి సంతకం కోసం పంపారు. శుక్రవారం సాయంత్రం బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేయనున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించారు. దీంతో పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ట్రంప్ తీసుకొచ్చిన ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. లక్షలాది కుటుంబాలకు డెత్ ట్యాక్స్ నుంచి విముక్తి కల్పించానని తెలిపారు.
VICTORY: The One Big Beautiful Bill Passes U.S. Congress, Heads to President Trump’s Desk 🇺🇸🎉 pic.twitter.com/d1nbOlL21G
— The White House (@WhiteHouse) July 3, 2025
అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు. అనంతరం, దీనిపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ.. సభ మైనారిటీ నేత హకీం జెఫ్రీస్.. 8 గంటల 32 నిమిషాలపాటు మాట్లాడారు. కాగా, బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం ట్రంప్ సాధించిన అతిపెద్ద విజయమని ఆయన మద్దతుదారులు వెల్లడించారు.
ట్రంప్ తీసుకొచ్చిన ఈ వివాదాస్పద బిల్లుకు బుధవారం సెనెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పన్నుల కోత, ప్రభుత్వ వ్యయానికి సంబంధించి తీసుకొచ్చిన 1000 పేజీల ఈ బిల్లుపై సెనేట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ నిర్వహించగా.. బిల్లుకు అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 50 ఓట్లు వచ్చాయి.
చివరికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై-బ్రేకర్‌గా మారి బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతో సెనేట్‌లో ఈ బిల్లు గట్టెక్కింది. 51-50 ఓట్లతో ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందినట్లు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. ఈ బిల్లును అధికారపార్టీకి చెందిన ముగ్గురు రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించారు.
4.5ట్రిలియన్ డాలర్ల పన్ను తగ్గింపులు, మెడికెయిడ్, ఫుడ్ స్టాంప్‌లలో 1.2 ట్రిలియన్ డాలర్ల కోతలు, సరిహద్దు భద్రతకు నిధులు సమకూర్చడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధులు కేటాయించడం వంటి లక్ష్యాలతో ట్రంప్ సర్కార్ ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డెమోక్రాట్లతోపాటూ, కొందరు రిపబ్లికన్లు సైతం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు కారణంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్, అధ్యక్షుడు ట్రంప్ మధ్య విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. కాగా, ఈ బిల్లు ఆమోదం పొందితే తాను కొత్తపార్టీ పెడతానని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే ‘అమెరికన్ పార్టీ’ పేరిట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు.