US Congress | గతేడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అధికారిక సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ట్రంప్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ (US Congress) తాజాగా ధ్రువీకరించింది.
2020 నాటి నవంబర్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు నిర్వహించిన సమావేశం ఉద్రిక్తతకు దారి తీసింది. బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశమైన క్యాపిటల్ భవనంలోకి వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు చొచ్చుకెళ్లి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పటిష్ఠ బందోబస్తు నడుమ పార్లమెంట్ ఉమ్మడి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన ఓట్లను లెక్కించారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్క్ 270 కాగా.. ట్రంప్‌కు 312, హారిస్‌కు 226 ఓట్లు వచ్చాయి. ఈ సమావేశానికి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగి ట్రంప్ చేతిలో ఓటమిపాలైన కమలా హారిస్ (Kamala Harris) అధ్యక్షత వహించారు. హారిసే ట్రంప్ గెలుపును ధ్రువీకరించారు. నవంబర్ 5 నాటి ఫలితాలను ధ్రువీకరించడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇదో బిగ్ మూమెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇక ఇదే సమావేశంలో అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడి ఎన్నికపైనా కమలా హారిస్ ప్రకటన చేశారు. ట్రంప్ రన్నింగ్ మేట్, ఒహియో సెనెటర్ జేడీ వాన్స్‌కు 312 ఓట్లు వచ్చినట్లు ప్రకటించారు.
Also Read..
Donald Trump | ఇటలీ ప్రధాని మెలొనితో కలిసి సినిమా చూసిన డొనాల్డ్ ట్రంప్..!
Elon Musk | అమెరికాలోనే కాదు ఐరోపా దేశాల్లోనూ.. మంట పెడుతున్న మస్క్
Canada PM | కెనడా తదుపరి ప్రధాని ఎవరు..? రేసులో భారత సంతతి ఎంపీ