Elon Musk | న్యూయార్క్, జనవరి 6: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ దూకుడు ఇప్పుడు అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ సమస్యలు సృష్టిస్తున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయానికి దోహదపడ్డ మస్క్ ట్రంప్ శిబిరంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి మస్క్ తీరు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులను రెండుగా చీలుస్తున్నాయి. ట్రంప్ గెలుపుతో అమెరికాలో తన ప్రాబల్యాన్ని పెంచుకున్న మస్క్.. ఇప్పుడు ఇతర దేశాల రాజకీయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. యూకే, జర్మనీ తదితర ఐరోపా దేశాల అంతర్గత అంశాల్లో వేలు పెడుతున్నారు. ఆయా దేశాల్లోని రైట్ వింగ్ పార్టీలకు బాహాటంగా మద్దతు ప్రకటిస్తూ ఇతర పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఎక్స్’ ద్వారా సోషల్ మీడియాలో, టెస్లా వంటి సంస్థలతో ఆర్థిక వ్యవస్థలో బలమైన వ్యక్తిగా మారిన మస్క్ వ్యవహారం ఇప్పుడు ఆయా దేశాల్లో కలహాలకు కారణమవుతున్నది. అమెరికాతో ఆ దేశాల సంబంధాలనూ దెబ్బతీస్తున్నది.
యూకే ప్రధాని కీర్ స్టార్మర్, లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఎలాన్ మస్క్ తన ‘ఎక్స్’లో తీవ్ర విమర్శలు గుప్పించారు. 2013 నాటి రోటెర్హామ్ చైల్డ్ సెక్స్ స్కాండల్‌లో బాలికలపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణాకు పాల్పడిన పాకిస్థాన్ మూలాలు కలిగిన గ్రూమింగ్ గ్యాంగులకు శిక్ష పడేలా చేయడంలో గతంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్గా పని చేసిన స్టార్మర్ విఫలమయ్యారని మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. యూకేలోఎన్నికలు జరిగి ఆరు నెలలే కాగా అప్పుడే పార్లమెంటును రద్దు చేయాలంటూ బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్‌ను మస్క్ కోరారు. రైట్ వింగ్ పక్షమైన రిఫార్మ్ యూకే పార్టీకి మస్క్ బాహాటంగా మద్దతు ప్రకటిస్తున్నారు.
యూకేతోనే మస్క్ ఆగిపోవడం లేదు. జర్మనీలో ఛాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్ మూర్ఖుడని విమర్శించడంతో పాటు ఆయన రాజీనామా చేయాలని మస్క్ డిమాండ్ చేశారు. రైట్ వింగ్ పార్టీగా ముద్రపడిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి ట్రంప్ మద్దతు ప్రకటిస్తున్నారు. యూరోపియన్ కమిషన్‌పైనా విమర్శలు చేస్తున్నారు. రొమేనియా ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకొని, న్యాయమూర్తులను నియంతలని ఆరోపించారు. ఇదే సమయంలో రైట్ వింగ్ నేతలుగా ముద్రపడిన హంగేరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి సానుకూల ప్రకటనలు చేస్తున్నారు.
తమ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, రాజకీయాలు చేస్తున్న మస్క్ తీరుపై ఆయా దేశాధినేతలు మండిపడుతున్నారు. మస్క్ తీరును యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా విమర్శించారు. తన ‘ఎక్స్’ అల్గారిథమ్‌ను వినియోగించుకొని మస్క్ ఇతరులపై అబద్ధాలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర దేశాల ఎన్నికలు, రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ మస్క్ ప్రపంచవ్యాప్తంగా విభేదాలకు కారణమవుతున్నారని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఆరోపించారు. అపారమైన సోషల్ మీడియా ఉండటంతో మస్క్ ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, ఇది ఆందోళనకరమని నార్వే ప్రధాని జోనస్ గహ్ స్టోర్ సోమవారం వ్యాఖ్యానించారు. మస్క్ కారణంగా ఆయా దేశాలతో అమెరికా సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొంటున్నాయి.