ల్వీవ్, మార్చి 14: ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అని లేకుండా అన్ని నగరాల్లో సైరన్ల మోత మోగుతున్నది. కీవ్ శివార్లలో రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య పోరాటం సాగుతున్నది. మరింత మందిని తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం రష్యా దాడుల్లో 20కిపైగా ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 636 మంది చనిపోయినట్టు ఐరాస మానవహక్కుల కార్యాలయం సోమవారం ధ్రువీకరించింది. అందులో 46 మంది చిన్నారులు ఉన్నట్టు తెలిపింది. మరియుపోల్, ఖార్కీవ్లో మరణాల లెక్కింపు కష్టంగా మారిందని పేర్కొన్నది. రష్యా దాడి మహావిపత్తు అని, పీడకల కంటే తక్కువేమీ కాదని రెడ్‌క్రాస్ వ్యాఖ్యానించింది. చెర్నోబిల్‌కు విద్యుత్తు సరఫరా చేసే లైను రష్యా దాడులతో మళ్లీ ధ్వంసం అయిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇటీవలే పవర్ లైన్ ధ్వంసం అయితే పునరుద్ధించారు. రెండు రోజుల్లో అయిపోతుందనుకొన్న యుద్ధం ఇరవై రోజులైనా ముగియకపోవడంతో పుతిన్ అసహనంగా ఉన్నారని, తమ మిలిటరీ వైఫల్యంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయన ఉక్రెయిన్‌లో మరింత విధ్వంసానికి ఆదేశించవచ్చని హెచ్చరించాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య నాలుగో విడత చర్చలు ఆన్లైన్లో ప్రారంభమయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి. మంగళవారం కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
రేపు మీపై కూడా బాంబులు
ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా.. చైనా సాయాన్ని కోరిందని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ‘రష్యాకు సాయం చేస్తే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ విషయంపై ఇప్పటికే చైనాను హెచ్చరించాం’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అన్నారు. ఈ ఆరోపణలను చైనా ఖండించింది. అమెరికా అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడింది. ఉక్రెయిన్ సైనిక స్థావరంపై దాడిని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. తమ దేశాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని నాటోను మళ్లీ డిమాండ్ చేశారు. ‘మీరు ఉక్రెయిన్ను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించకపోతే రష్యా రేపు మీపై కూడా బాంబులు వేస్తుంది’ అన్నారు.
పుతిన్‌కు ఎలాన్ మస్క్ చాలెంజ్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చాలెంజ్ విసిరారు. తనతో ముఖాముఖి పోటీ దిగాలన్నారు. ఇద్దరిలో గెలిచినవారే యుద్ధంపై నిర్ణయం తీసుకొంటారని పేర్కొన్నారు. దీనికి సిద్ధమేనా అని పుతిన్‌ను సవాలు చేశారు. ఈ అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. రష్యా అధ్యక్ష భవనపు ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేశారు. ‘రష్యా ఏ యుద్ధంలోనైనా గెలవగలదు’ అని ఓ నెటిజన్ రిైప్లె ఇవ్వగా..‘పుతిన్ సులభంగా గెలుస్తారని భావిస్తే నా చాలెంజ్‌ను స్వీకరించా లి. కానీ పుతిన్ అంగీకరించరు’అని మస్క్ అన్నారు.
చమురుపై భారీ డిస్కౌంట్ ఇస్తామన్న రష్యా
డిస్కౌంట్‌పై ఆయిల్‌ను సరఫరా చేస్తామని రష్యా భారత్‌కు ఆఫర్ చేసింది. ఆఫర్‌ను అంగీకరించాలా.. వద్దా.. అన్న అంశంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆలోచనలో ఉంది. ఈ మేరకు భారత ప్రభుత్వ అధికారి ఒకరు తమకు చెప్పినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ‘భారీ డిస్కౌంట్‌పై ఆయిల్ సరఫరాకు రష్యా సిద్ధంగా ఉంది. ట్యాంకర్లు, బీమా లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కారం అయ్యాక రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాం’ అని ఆ అధికారి చెప్పారు. భారతదేశానికి అవసరమైన మొత్తం చమురులో 80 శాతం దిగుమతుల ద్వారానే వస్తున్నది. ఇందులో రష్యా వాటా 2-3 శాతమే. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో చాలా దేశాలు రష్యా నుంచి చమురు కొనడానికి సంకోచిస్తున్నాయి. అయితే ఆ ఆంక్షలు భారత్‌పై ప్రభావం చూపబోవని భారత ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.