Iran Ship Seize : ఇరాన్-అమెరికా (Iran-US) దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. అగ్రరాజ్యం అమెరికా వరుసగా నౌకలను సీజ్ చేస్తున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇరాన్‌కు చెందిన ఓ నౌకను అగ్రరాజ్యం స్వాధీనం చేసుకుంది. తాజాగా హిందూ మహాసముద్రం (Indian Ocean) లోనూ మరో నౌకను అమెరికా (USA) సైన్యం సీజ్ చేసింది. ఈ విషయాన్ని అగ్రరాజ్య రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
‘మేజిస్టిక్ ఎక్స్’ పేరుతో ఉన్న నౌకను తమ దళాలు స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ నౌకలో ఇరాన్ చమురును అక్రమంగా తరలిస్తున్నట్లు అగ్రరాజ్యం పేర్కొన్నది. ‘ఇరాన్‌కు సైనిక సాయం అందించే నౌకలను, సముద్ర మార్గంలో అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను తాము అడ్డుకుంటూనే ఉంటామని అమెరికా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. నౌక సీజ్‌కు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేసింది. హెలికాప్టర్ల నుంచి ఈ నౌకపైకి అమెరికా దళాలు దిగుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.
Overnight, U.S. forces carried out a maritime interdiction and right-of-visit boarding of the sanctioned stateless vessel M/T Majestic X transporting oil from Iran, in the Indian Ocean within the INDOPACOM area of responsibility.
We will continue global maritime enforcement to… pic.twitter.com/SWF6Jt9Ci4
— Department of War 🇺🇸 (@DeptofWar) April 23, 2026
షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. ఈ ‘మేజిస్టిక్ ఎక్స్’ నౌక శ్రీలంక, ఇండోనేసియా మధ్య హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న ‘తౌస్కా’ అనే వాణిజ్య నౌకను అమెరికా సీజ్ చేసింది. ఆ నౌకలో క్షిపణి తయారీలో ఉపయోగించే రసాయనాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా తమ వాణిజ్య నౌకను సీజ్ చేయడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నౌకను, అందులోని సిబ్బందిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది.