వాషింగ్టన్: తనకు అనుకూలంగా లేని దేశాలపై ఎడాపెడా టారిఫ్‌లు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుంకాల పెంపు (Tariffs) రాజ్యాంగ విరుద్ధమని, ఆ చట్టబద్ధ హక్కు ట్రంప్‌కు లేదని యూఎస్ ఫెడరల్ అప్పీల్ల కోర్టు (US federal appeals court) తీర్పునిచ్చింది. ట్రంప్ విధించిన సుంకాలు (Trum Tariffs) చాలా వరకు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్‌లను పెంచినట్లు వ్యాఖ్యానించింది. భారీగా విధించిన టారిఫ్‌ల వల్ల పలు దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయయని పేర్కొంది. అయితే ప్రస్తుతానికి పెంచిన సుంకాలను అక్టోబర్ మధ్య వరకు కొనసాగించడానికి అనుమతించింది. ఈమేరకు 7-4 తేడాతో న్యాయమూర్తులు తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై యూఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు అనుమతించారు.
ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. ‘అమెరికా ఫస్ట్’ పేరుతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అగ్రరాజ్యంతో వాణిజ్యం చేస్తున్న ప్రతి దేశంపై టారీఫ్‌లు విధించేలా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్ (IEEPA)ను ట్రంప్ తీసుకొచ్చారు. బేస్‌లైన్‌గా 10 శాతం టారిఫ్ విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తుందన్న సాకుతో భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. దీనిపై ఇంటా బయటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా విజయం సాధిస్తుంది..
కాగా, అప్పీల్ల కోర్టు తీర్పుపై ట్రంప్ స్పందిస్తూ అమెరికా చివరికి విజయం సాధిస్తుందని విజయం సాధిస్తుందన్నారు. అప్పీల్ల కోర్టు తీర్పును తప్పుబడుతూ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పోస్టు చేశారు. అన్ని దేశాలపై విధించిన సుంకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని చెప్పారు. వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని పక్షపాత అప్పీళ్ల కోర్టు తీర్పు చెప్పిందని మండిపడ్డారు. ఈ ప్రక్రియలో చివరకు అమెరికా విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ టారిఫ్‌లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుందన్నారు. అమెరికా మరింత బలపడాలి, కానీ ఈ నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి సుంకాలు ఇప్పటికీ అత్యుత్తమ మార్గమని తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్‌లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అమెరికాను బలమైన, ధనిక, శక్తివంతంగా మారుస్తానని చెప్పారు.