UNSC : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ (Inida-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ శిక్షణ ఇచ్చినట్లు ఆధారాలు లభించడంతో ఆ దేశంపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్-UNSC) ని పాకిస్థాన్ కోరింది.
భారత్తో ఉద్రిక్తతలపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సమావేశమయ్యేలా ప్రయత్నించాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. ఐరాసలో పాక్ శాశ్వత రాయబారి ఆసిం ఇఫ్తికార్ను ఆదివారం ఆదేశించారు. ఆ మేరకు ఇఫ్తికార్ ఐరాస భద్రతామండలికి విజ్ఞప్తి చేశారు. దాంతో ఐరాస భద్రతామండలి ఇవాళ క్లోజ్డ్ డోర్ మీటింగ్ ఏర్పాటు చేసింది. భారత్ చర్యలు, హెచ్చరికల ప్రకటనల గురించి ఐరాస భద్రతా మండలికి సమాచారం ఇస్తామని ఆదివారం పాక్ విదేశాంగశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా పహల్గాం ఉగ్రదాడిని ఏప్రిల్ 23న ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది భారతీయులు కాగా, ఒకరు నేపాలీ ఉన్నారు.