వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధన ప్రకారం.. హెచ్-1బీ వీసాదారులు, ఇతర తాత్కాలిక విదేశీ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతే, ప్రస్తుతం లభిస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దయ్యే అవకాశం ఉన్నది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగులు తక్షణమే అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. యూఎస్ సిటిజన్‌షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) మినహాయింపు ఇస్తే తప్ప, వారు అమెరికాలో ఉంటూ తమ వీసా హోదాను లేదా ఉద్యోగ యజమానిని మార్చుకోవడం సాధ్యపడదు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ఉన్నది. ఈ సమీక్ష పూర్తయిన తర్వాత ప్రభుత్వం దీనిని ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురిస్తుంది. తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు 30 నుంచి 60 రోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారు. ఈ నిబంధన అమల్లోకి వస్తే, వీసా గడువు ముగిసేలోపే ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు చట్టబద్ధమైన హోదాలో లేనట్టే భావిస్తారు. దీనివల్ల వారు వెంటనే అమెరికాను విడిచి వెళ్లాల్సి వస్తుంది. యూఎస్సీఐఎస్ తన ప్రత్యేక అధికారంతో మినహాయింపు ఇస్తే తప్ప వారు దేశంలోనే ఉంటూ కొత్త ఉద్యోగంలో చేరడం లేదా వేరే వీసా క్యాటగిరీకి మారడం కుదరదు.
60 రోజుల గ్రేస్ పీరియడ్..
ప్రస్తుతం అమల్లో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధనను 2016లో ప్రవేశపెట్టగా 2017 ప్రారంభంలో అమల్లోకి వచ్చింది. ఇది హెచ్-1బీ, హెచ్-1బీ1, ఎల్-1, వో-1, టీఎన్, ఈ-1, ఈ-2, ఈ-3 వీసాదారులు, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు వర్తిస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఉద్యోగం కోల్పోయినవారు 60 రోజులు లేదా వారి ఐ-94 గడువు ముగిసేవరకు అమెరికాలో ఉండవచ్చు. ఈ సమయంలో వారు కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, వీసా స్టేటస్ మార్పునకు దరఖాస్తు చేయడం లేదా దేశం విడిచి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవడం వంటివి చేయవచ్చు. గ్రేస్ పీరియడ్ ఉద్యోగం పోయినా లేదా రాజీనామా చేసినా వర్తిస్తుంది.
భారతీయులపై ప్రభావం..
ఈ ప్రతిపాదన ఇంకా ఫెడరల్ సమీక్ష దశలోనే ఉన్నది. పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. ఒకవేళ ఇది ఆమోదం పొందితే ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త అవకాశాలు వెతుక్కునే వెసులుబాటు ఉండదు. హెచ్-1బీ, ఇతర తాత్కాలిక వీసాదారులకు ఇది పెద్ద సవాలుగా మారనున్నది. హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాలో పనిచేస్తున్నవారిలో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉండటంతో, ఈ ప్రతిపాదిత మార్పు భారతీయ టెక్ ఉద్యోగులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం కోసం వెతుక్కునే సమయం లేకపోవడంతో వారిపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఇది ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉన్నది. తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా అమల్లోకి వచ్చేవరకు ప్రస్తుత నిబంధనలు కొనసాగుతాయి.
చదువు పూర్తయ్యాక భారత్ వెళ్లిపోతాం
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన చాలామంది విద్యార్థులు చదువు పూర్తయ్యాక తిరిగి భారత్‌కు తిరిగి రావాలని అనుకుంటున్నారు. అలా భావిస్తున్న విద్యార్థుల సంఖ్య 81 శాతం ఉందని స్టూడెంట్ మొబిలిటీ ఇండెక్స్ పేరుతో ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది తమ కుటుంబంలో తామే తొలిసారి విదేశీ విద్యనభ్యసిస్తున్నట్టు తెలుపగా, ఐదుగురు తమ సొంత నిర్ణయంతోనే విదేశాల్లో విద్యాభ్యాసనకు వచ్చినట్టు తెలిపారు. 17,925 మంది విద్యార్థులపై నిర్వహించిన ఈ సర్వేలో వారు కోరుకుంటున్న కోర్సులు, కుటుంబ నేపథ్యం, చదువు తర్వాత ప్రణాళికలు తదితర అంశాల గురించి వివరాలు సేకరించారు.
ఎఫ్-1 వీసాల ఆమోదాన్ని అమెరికా కఠినతరం చేయడంతో భారతీయులకు ఇచ్చే యూఎస్ విద్యార్థి వీసాలు 62 శాతం మేర పడిపోయాయి. ఈ సర్వేలో మరో 15 శాతం మంది తాము గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తున్నట్టు తెలిపారు. అయితే వారు భారత దేశంలో పనిచేయాలనుకుంటున్నారా లేదా విదేశాలలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. విద్యా సంస్థలకు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం కోసం గూగుల్‌పై ఆధారపడుతున్నట్టు 56 శాతం మంది తెలిపారు. స్వయం ప్రేరణతో దరఖాస్తు చేసుకునే వారు 2023-24లో 24 శాతం ఉండగా, 2024-25లో అది 34కు, 2025-26లో 49 శాతానికి చేరుకున్నది.
కెనడాలో భారతీయుల బహిష్కరణ ఆరు నెలల్లో స్వదేశానికి 3,323 మంది
కెనడాలో ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలు, వీసా గడువు ముగియడం, మోసపూరిత చర్యలు, శరణార్థి దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో భారతీయుల బహిష్కరణలు భారీగా పెరుగుతున్నాయి. కెనడా సరిహద్దు సేవల సంస్థ(సీబీఎస్ఏ) వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 3,323 మంది భారతీయ పౌరులను ఆ దేశం నుంచి వెనక్కి పంపారు. 2025లో బహిష్కరించిన 3,779 మందితో పోలిస్తే, ఈ ఏడాది కేవలం ఆరు నెలల్లోనే ఆ సంఖ్య 88 శాతానికి చేరుకోవడం గమనార్హం. దేశం విడిచి వెళ్లాల్సిన వారి జాబితాలోనూ 7,669 మంది భారతీయులు నిరీక్షిస్తున్నారు. కెనడా తీసుకున్న కఠినమైన నిర్ణయాలు, వలస విధానాల మార్పులపై యువతలో ఆందోళన వ్యక్తమవుతున్నది.