UN Secretary General | ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందలాది మిస్సైళ్లతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఐక్య రాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా ఆ దేశం నిషేధం విధించింది. ఇరాన్ మిస్సైల్ దాడిని ఖండించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఇజ్రాయెల్.. ఈ మేరకు ఆయనకు దేశంలో రాకుండా బ్యాన్ విధించింది. యూఎన్ సెక్రెటరీ జనరల్ గుటెర్రెస్ వ్యక్తిత్వం లేని మనిషి అని ఇజ్రాయెల్ మంత్రి కాజ్ట్ విమర్శించారు. ఇరాన్ దాడిని ఖండించలేని ఎవరికైనా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే అర్హత లేదన్నారు.
గతేడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిని సైతం గుటెర్రెస్ ఖండించలేదని.. కానీ, ఇజ్రాయెల్ తమ పౌరులకు రక్షణ కల్పిస్తుందన్నారు. సోషల్ మీడియా పోస్ట్‌లో హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. సెక్రటరీ జనరల్ టెర్రరిస్టులు, రేపిస్టులకు మద్దతు ఇస్తున్నారన్నారు. హమాస్, హిజ్బొల్లా, హౌతీలు, తాజాగా ఇరాన్ హంతకులకు మద్దతు ఇస్తున్నారని.. ఐరాస చరిత్రలో గుటెర్రెస్ మాయని మచ్చ అంటూ తీవ్రంగా స్పందించారు. ఇరాన్, హమాస్, హిజ్బొల్లాతో వివాదాల సమయంలోనూ గుటెర్రెస్ ఇజ్రాయెల్‌కు సహాయం చేయలేదని ఆరోపించారు. ఇరాన్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ సైతం ప్రతి దాడి తప్పదని హెచ్చరించింది. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమ ఆసియాలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.