UN request | స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే మహిళలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) తాలిబాన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఆఫ్ఘనిస్తాన్‌కు యూఎన్ మిషన్ తాత్కాలిక అధిపతి.. తాలిబాన్ పరిపాలన తాత్కాలిక ఆర్థిక మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్జీవోల్లో పనిచేసే మహిళా సేవకులపై విధించిన నిషేధాన్ని తొలగించాలని కోరారు. ఈ మేరకు యూఎన్ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది.
మహిళలను పని లోనికి రాకుండా నిరోధించాలంటూ తాలిబాన్ ప్రభుత్వం శనివారం అన్ని స్థానిక, విదేశీ ప్రభుత్వేతర సంస్థలను (ఎన్జీఓ) ఆదేశించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్రహ్మాన్ హబీబ్ ధ్రువీకరించిన లేఖలో ఎన్జీఓల్లోని మహిళా ఉద్యోగులను తదుపరి నోటీసు ఇచ్చేంత వరకు పని చేయడానికి అనుమతించకుండా చూడాలని పేర్కొన్నది. కొందరు మహిళా ఉద్యోగులు ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను పాటించకపోవడం వల్లనే ఈ చర్యలకు ఉపక్రమించినట్లుగా లేఖలో స్పష్టం చేశారు.
దీనికన్నా ముందు మహిళలకు విశ్వవిద్యాలయ విద్యపై తాలిబాన్ ప్రభుత్వం నిరవధిక నిషేధం విధించింది. ఈ చర్యను ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ఇదే సమయంలో ఎన్జీవోల్లో పనిచేస్తూ ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించని మహిళా ఉద్యోగులపై చర్యలకు దిగింది. ఈ చర్యపై ఏకంగా ఐక్యరాజ్య సమితి అందరి కన్నా ముందుగా స్పందించింది. ఈ చర్యను ఉపసంహరించుకుని మహిళలు ఎన్జీవోల్లో పనిచేసేలా చూడాలని యూఎన్ ప్రతినిధి కోరారు.