Ukrainian-Russia War | కీవ్, ఆగస్టు 15: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. రష్యా భూభాగంలోని కుర్స్ ప్రాంతంలో ఉన్న సడ్జా పట్టణాన్ని తమ బలగాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించారు. ఈ పట్టణంలో దాదాపు 5,000 జనాభా ఉన్నారు. పశ్చిమ సైబీరియా చమురు నిక్షేపాల నుంచి ప్రవహించే పైప్లైన్లు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. సడ్జా పట్టణంలో ఉక్రెయిన్ సైనిక కమాండర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు జెలెన్స్కీ ప్రకటించారు. కాగా, జనవరి నుంచి ఉక్రెయిన్‌లోని 1,175 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రష్యా ఆక్రమించగా, ఇప్పుడు మొదటిసారిగా రష్యా భూభాగంలోని దాదాపు 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ ఆక్రమించిందని వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ తెలిపింది.
రష్యా – యూరోప్ మధ్య ఉండే నార్డ్ స్ట్రీమ్ సహజ వాయువు పైప్లైన్ల పేలుళ్ల వెనుక ఉక్రెయిన్ బలగాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఒక కథనం ప్రచురితమైంది. దీని ప్రకారం.. ఉక్రెయిన్‌పైకి రష్యా దండెత్తిన తర్వాత రష్యాను దెబ్బతీసేందుకు గానూ ఆ దేశం నుంచి యూరోప్ వెళ్లే నార్డ్ స్ట్రీమ్ 1, నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్లను పేల్చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఓ వ్యాపారవేత్త సూచించారు. ఈ మేరకు 2022 మేలో ఈ ప్రణాళిక అమలు చేయడానికి జెలెన్స్కీ ఆమోదం తెలిపారు.
అయితే, ఈ విషయం అమెరికా నిఘా సంస్థ సీఐఏకి తెలిసి, ప్రణాళికను విరమించుకోవాలని కోరడంతో జెలెన్స్కీ వెనక్కు తగ్గారు. తర్వాత సెప్టెంబర్‌లో జెలెన్స్కీకి సంబంధం లేకుండానే అప్పటి ఉక్రెయిన్ సైనికాధికారి జలుజ్నీ ఒక ప్రణాళిక రచించి బాల్టిక్ సముద్రంలో పైప్లైన్లను పేల్చేయించారు. కాగా, ఈ వార్తలను ఉక్రెయిన్ ఖండించింది. పైప్‌లైన్ పేలుళ్లలో తమ ప్రమేయం లేదని పేర్కొన్నది.