మాస్కో, డిసెంబర్ 29: రష్యాలో అధ్యక్షుడు పుతిన్ అధికార నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు ప్రయత్నించిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ చెప్పారు. నోవ్గోరోడ్ ప్రాంతంలో అధ్యక్షుడి నివాసాన్ని టార్గెట్ చేస్తూ ఓ రోజు రాత్రి ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసినట్టు ఆయన ఆరోపించారు. అయితే వీటిని రష్యా విజయవంతంగా అడ్డుకుందని, గగనతల రక్షణ వ్యవస్థ 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను కూల్చేసిందని ఆయన పేర్కొన్నారు. రష్యా ఆరోపణల్ని ఉక్రెయిన్ ఖండి ంచింది. మరిన్ని సైనిక దాడులు చేపట్టేందుకు, శాంతి చర్చల్ని దెబ్బతీసేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నంగా ఉక్రెయిన్ తెలిపింది.
రష్యాతో యుద్ధం ముగింపు కోసం రూపొందే ఎలాంటి శాంతి ప్రణాళిక అయినా రెఫరెండంలో ఉక్రెయిన్ ప్రజల ఆమోదం పొందాలని జెలెన్స్కీ స్పష్టంచేశారు. ప్రతిపాదిత 20 అంశాల శాంతి ప్రణాళిక అనేది కనీసం 60 రోజుల కాల్పుల విరమణ తర్వాతే ముందుకు తేవాలని పేర్కొన్నారు. శాంతి చర్చల్లో ఇంకా అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.