కీవ్, మార్చి 25: నెలరోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తున్నది. ఇరుసేనల్లో ఎవరిది పైచేయి అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. పశ్చిమ దేశాల మీడియాల్లో వస్తున్న కథనాలు, స్వతంత్ర సంస్థల నివేదికలు, ఇరుదేశాల అధినేతల ప్రకటనలు వెరసి అక్కడ వాస్తవంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి నెలకొన్నది.
ఫిబ్రవరి 24న సైనిక చర్య ప్రారంభించే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. ‘తమ డిమాండ్లకు తలొగ్గకపోతే వారంలో ఉక్రెయిన్ను హస్తగతం చేసుకొంటాం’ అని హెచ్చరించారు. వారం కాదుకదా.. నెలరోజులు గడిచినప్పటికీ, రష్యా దళాలు రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోలేకపోయాయని పశ్చిమ మీడియా వెల్లడించింది. దీనికితోడు ఉక్రెయిన్ సేనలధాటికి తట్టుకోలేక పుతిన్ సేనలు ఆయుధాలు విడిచి పారిపోతున్నాయని, పుతిన్ వైఖరిని నిరసిస్తూ మరికొందరు రష్యా సైనికులు ఉక్రెయిన్ దళాల్లో చేరుతున్నారని బ్రిటన్ మీడియా చెబుతున్నది. దీంతో యుద్ధంలో ఉక్రెయిన్‌దే పైచేయి అని అంతా అనుకొన్నారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో దేశాలకు రోజూ చేస్తున్న విజ్ఞప్తులు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. ఉక్రెయిన్ నగరాలను రష్యా పూర్తిస్థాయిలో నాశనం చేయకముందే.. తమ గగనతలాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించాలని జెలెన్స్కీ నాటో దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నాటో కూటమి దగ్గర ఉన్న ఆయుధాల్లో ఒక్క శాతం ఇచ్చినా పుతిన్‌కు తామేంటో చూపిస్తామని సవాల్ విసిరారు.
దీంతో యుద్ధక్షేత్రంలో ఉక్రెయిన్ సేనలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు అర్థమవుతున్నది. యుద్ధంలో సైనికుల మరణాలు, ధ్వంసమైన ఆయుధ సామగ్రిపై ఇరుదేశాలు ప్రకటిస్తున్న వివరాలకూ ఎక్కడా పొంతనలేదు. యుద్ధంలో ఇప్పటివరకూ 1,351 మంది తమ సైనికులు మరణించినట్టు రష్యా ప్రకటించింది. పోరులో 7 వేల నుంచి 15 వేల మంది రష్యా సైనికులు మరణించారని నాటో చెబుతున్నది. ఇవన్నీ చూస్తే ఉక్రెయిన్ యుద్ధంలో వాస్తవ పరిస్థితులు బయటకు రావట్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘మే 9 నాటికి రష్యా యుద్ధాన్ని ముగించాలనుకొంటున్నది. ఈ మేరకు రష్యా దళాలకు సమాచారం ఇచ్చారు’ అంటూ ఉక్రెయిన్ ఆర్మీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై తొలిదశ సైనికచర్య ముగిసిందని రష్యా వెల్లడించింది.
అలా అయితే నాటో రంగంలోకి..
ఉక్రెయిన్‌పై రష్యా ఫాస్పరస్ బాంబులను వాడిందన్న జెలెన్స్కీ ఆరోపణలను రష్యా ఖండించింది. తాము ఎప్పుడూ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించలేదని పేర్కొంది. రష్యా రసాయనిక దాడికి దిగితే నాటో రంగంలోకి దిగుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. జీ-20 నుంచి తమను బహిష్కరించినా జరిగే నష్టమేమీ లేదని రష్యా పేర్కొం ది. జీ-20 కూటమి నుంచి రష్యాను తొలగించాలన్న అమెరికా డిమాండ్ నేపథ్యంలో రష్యా స్పందించింది.
థియేటర్‌పై దాడిలో300 మంది మృతి
మరియుపోల్‌లోని ఓ థియేటర్‌పై గతవారం రష్యా జరిపిన బాంబు దాడిలో దాదాపు 300 మంది మరణించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఘటన సమయంలో థియేటర్లో వెయ్యిమందికి పైగా తలదాచుకొన్నట్టు వెల్లడించారు. మరియుపోల్‌లో సామూహిక ఖననాలు పెరుగుతున్నట్టు ఉక్రెయిన్‌లోని ఐరాస మానవ హక్కుల బృందం అధిపతి బోగ్నర్ తెలిపా రు. శుక్రవారం ఉదయం ఖర్కీవ్‌లోని ఓ వైద్య కేంద్రంపై పుతిన్ సేనలు జరిపిన రాకెట్ దాడుల్లో నలుగురు మరణించారు. రష్యాకు చెందిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ క్రాసుఖా-4 ఈడబ్ల్యూను స్వాధీనం చేసుకొన్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా దాదాపు 1,200 క్రూజ్ క్షిపణులను ప్రయోగించిందని, అయితే అందు లో 59% పేలలేదని ఉక్రెయిన్ తెలిపింది.