కీవ్: ఖనిజాల(Ukraine Minerals) తొవ్వకాలపై అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరింది. ప్రాథమికంగా ఆ డీల్‌పై ఉక్రెయిన్ మంత్రి యులియా సిరిడెంటో సంతకం చేశారు. దీనిపై ఆమె ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లో ఉన్న అరుదైన ఖనిజాలను తొవ్వేందుకు అమెరికాతో ఆ దేశం ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే దీనిపై తుది ఒప్పందం వచ్చే వారం జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.
అమెరికా భాగస్వామితో మెమోరండం ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేసినట్లు ఉక్రెయిన్ మంత్రి చెప్పారు. ఉక్రెయిన్ పునర్ నిర్మాణం కోసం కావాల్సిన ఫండ్స్ వస్తాయని ఆమె ఆశాభాం వ్యక్తం చేశారు. అయితే డాక్యుమెంట్లో ఉన్న అంశాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. ఖనిజాల తొవ్వకాల ద్వారా వచ్చే నిధులను ఏ రకంగా వినియోగిస్తారో చెప్పలేదు. నిజానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల అమెరికా పర్యటనలో ఆ డీల్ కుదుర్చుకోవాల్సి ఉంది. కానీ ఆ పర్యటనలో ట్రంప్‌తో విబేధాలు ఏర్పడడంతో.. ఖనిజ ఒప్పందంపై సంతకాలు చేయకుండానే ఆయన వెనుదిరిగారు. అయితే చాన్నాళ్ల నుంచి జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
ఏం ఖనిజాలు ఉన్నాయి ?
ప్రపంచంలోని అత్యంత అరుదైన ఖనిజాల్లో అయిదు శాతం తమ వద్దే ఉన్నట్లు ఉక్రెయిన్ చెబుతోంది. వీటిల్లో 19 మిలియన్ల టన్నుల గ్రాఫైట్ నిలువలు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. గ్రాఫైట్ సరఫరా చేస్తున్న టాప్ 5 దేశాల్లో ఉక్రెయిన్ ఉన్నది. ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీలను గ్రాఫైట్ ద్వారానే తయారు చేస్తారు.
యురోప్కు సరఫరా చేస్తున్న టైటానియంలో ఏడు శాతం ఉక్రెయిన్ నుంచి వెళ్తోంది. ఇది చాలా లైట్‌వెయిట్ మెటల్. టైటానియంను అన్ని రకాల నిర్మాణాల్లో వాడుతారు. విమానాలు, పవర్ స్టేషన్ల నిర్మాణాల్లోనూ టైటానియంను వినియోగిస్తుంటారు. లిథియం డిపాజిట్లు ఉన్న మూడవ అతిపెద్ద దేశం కూడా ఉక్రెయిన్ అని తెలుస్తోంది. కరెంట్ బ్యాటరీలు తయారు చేయడంలో లిథియం మూలకం కీలకమైంది.
బెరిలియం, యురేనియం లాంటి మూలకాలు కూడా ఉక్రెయిన్‌లో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అణ్వాయుధాలు, అణు రియాక్టర్ల తయారీలో ఆ మూలకాలు కీలకమైనవి. కాపర్, లెడ్, జింక్, సిల్వర్, నికల్, కోబాల్ట్, మ్యాంగనీస్ లాంటి ఖనిజాల నిలువలు కూడా ఉక్రెయిన్‌లో ఉన్నాయి. ఆయుధాలు, విండ్ టర్బైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇతర ఆధునిక వస్తువుల తయారీకి అవసరమైన 17 రకాల ఖనిజాలు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.