వాషింగ్టన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా ఆఫర్ ఇచ్చింది. మరో దేశానికి తరలించేందుకు అమెరికా ఆయనకు స్నేహహస్తం అందించినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఆఫర్‌ను జెలెన్స్కీ తిరస్కరించినట్లు ఉక్రెయిన్ మీడియా పేర్కొన్నది. ప్రస్తుతం కీవ్ నగరంలోనే ఉన్నట్లు జెలెన్స్కీ తాజా వీడియోలో తెలిపారు. రష్యా దాడి తర్వాత జెలెన్స్కీ బంకర్లోకి వెళ్లారు. తన స్టాఫ్‌తో కలిసి కొన్ని గంటల క్రితం ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. అందరం ఇక్కడే ఉన్నామని, ఇక్కడే పోరాడుతామని, తనకు ఆయుధాలు కావాలని వీడియోలో జెలెన్స్కీ ప్రకటన చేశారు. దేశాన్ని రక్షించుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.
ఉక్రెయిన్ ప్రభుత్వం తరపున విదేశాల్లోనూ రిప్రజెంట్ చేసేందుకు జెలెన్స్కీని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు అమెరికా ఆసక్తిని ప్రదర్శించింది. కీవ్ నుంచి సురక్షితంగా అధ్యక్షుడిని తరలిస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా జెలెన్స్కీకి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆయన్ను తరలించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలోనే కీవ్ వీధుల్లో తీసిన ఓ వీడియోను ఆయన పోస్టు చేశారు. తమ సైనికులతో పాటు దేశాన్ని కాపాడుకుంటామని, కీవ్ నగరాన్ని విడిచి వెళ్లేది లేదని జెలెన్స్కీ తెలిపారు.