కీవ్ : తమ దేశంపై రష్యా అణిచివేతను ఉక్రెయిన్ ప్రభుత్వం మంగళవారం తీవ్రంగా ఖండించింది. రష్యా నేరపూరిత దేశమని, పుతిన్ ఓ అబద్దాలకోరు, దేశద్రోహి అంటూ మండిపడింది. రష్యా ఆక్రమణదారులకు వారి నేరాల గురించి బాగా తెలుసునని వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ విజయం ఎంతోదూరంలో లేదని స్పష్టం చేసింది. మన విజయం సమీపంలోనే ఉందని ఉక్రెయిన్ ప్రభుత్వం ట్వీట్ చేసింది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజా వీడియోలోనూ ఇదే సందేశం పంపారు.
ఉక్రెయిన్ వ్యూహాత్మక మలుపులో ఉందని, దేశం విజయం దిశగా కదులుతోందని వ్యాఖ్యానించారు. ఇక ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 27 లక్షల మంది ఉక్రెయిన్ను వీడి వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్ధుల హైకమిషనర్ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యధిక శరణార్ధుల ఉదంతం ఇదేనని ఐక్యరాజ్యసమితి రిఫ్యూజీ ఏజెన్సీ చీఫ్ ఫిలిపో గ్రండి పేర్కొన్నారు.
మరోవైపు ఉక్రెయిన్పై రష్యా 900కు పైగా క్షిపణులను పేల్చిందని అమెరికన్ రక్షణ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. పలు ఉక్రెయినియన్ నగరాల్లోని నివాస ప్రాంతాలపై రష్యన్ బలగాలు దాడులు చేపట్టాయని, పెద్దసంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. గంటగంటకూ మృతుల సంఖ్య మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మార్చి 13 అర్ధరాత్రి వరకూ 636 మంది మరణించగా 1125 మంది గాయపడ్డారని ఉక్రెయిన్లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పర్యవేక్షక మిషన్ తెలిపింది.