కీవ్, డిసెంబర్ 24: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ అత్యాధునిక పద్ధతులను అవలంబిస్తున్నది. అందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారి పూర్తిగా సాయుధ రోబోలు, డ్రోన్లతో కూడిన అసాల్టింగ్ ఫోర్స్‌ను రంగంలోకి దింపింది. ఉత్తర ఉక్రెయిన్‌లోని ఖార్ఖివ్ ఒబ్లాస్ట్ ప్రాంతంలో ఈ దళాన్ని ప్రయోగించి రష్యా సేనలపై విజయవంతంగా దాడులు జరిపింది.
ట్యాంకు విధ్వంసక ఫిరంగి గుళ్లలాంటి భారీ మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలిగే మల్టీ-రోటర్ కాప్టర్లు, ఎఫ్‌పీవీ డ్రోన్లు, రోబోలతో కూడిన డజన్ల కొలదీ యూనిట్లు సంప్రదాయ సైనిక బలగాల మాదిరిగా పరస్పరం సహకరించుకుంటూ ఏకకాలంలో ఈ దాడుల్లో పాల్గొన్నట్టు ఉక్రెయిన్ 13వ నేషనల్ బ్రిగేడ్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఈ దాడుల సందర్భంగా ఆ యూనిట్లు దాదాపు 8 వేల మంది రష్యా సైనికులను విజయవంతంగా ప్రతిఘటించి 5 మైళ్ల (8 కిలోమీటర్ల) ప్రాంతాన్ని కాపాడినట్టు తెలిపారు. కాగా, గతంలో రష్యా సైతం ఇలాంటి ఆధునిక పద్ధతుల్లో దాడులు నిర్వహించినప్పటికీ అవి పెద్దగా విజయవంతం కాలేదు. దీంతో యుద్ధంలో సైనికుల స్థానాన్ని డ్రోన్లు ఎప్పటికీ భర్తీ చేయలేవన్న వాదన గట్టిగా వినిపించింది. కానీ, ఇప్పుడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఉక్రెయిన్.. రోబోలు, డ్రోన్ల దళంతో రష్యా సేనలను విజయవంతంగా ప్రతిఘటించడంతో ఆ వాదనకు తెరపడే అవకాశం కనిపిస్తున్నది.