కీవ్, జనవరి 9: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ జరిపిన దాడికి ప్రతీకారంగానే శుక్రవారం ఈ దాడులు జరిగినట్టు తెలుస్తున్నది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపైకి వందల సంఖ్యలో డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులు దూసుకొచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
రష్యా తమపైకి 13 ఖండాంతర క్షిపణులు, 22 క్రూయిజ్ మిస్సైళ్లు, 242 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ముఖ్యంగా ఒరెష్నిక్ మిస్సైల్‌ను రష్యా ప్రయోగించినట్టు పేర్కొన్నారు. ఒరెష్నిక్ మిస్సైల్ ధ్వని కన్నా పది రెట్ల అధిక వేగంతో గంటకు 13 వేల కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణిస్తుంది.
యూరప్‌లోని దాదాపు అన్ని దేశాలపైకి ఈ మిస్సైల్‌ను ప్రయోగించేలా రష్యా దీన్ని డిజైన్ చేసింది. ఈ క్షిపణిని దాని వేగం కారణంగా ఎవరూ అడ్డుకోలేరని పుతిన్ ఇటీవల వెల్లడించారు. ఇది అణ్వాయుధంతో సరిసమానమైనదని అన్నారు.రష్యా దాడిలో నలుగురు మరణించగా, 25 మంది వరకు గాయపడ్డారు.