Zaporizhzhia Nuclear Plant | మాస్కో, ఆగస్టు 12: రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. తమ నియంత్రణలోని జపోరిజియా అణువిద్యుత్తు కేంద్రంపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. కేంద్రంలోని కూలింగ్ వ్యవస్థ ఉన్న ప్రాంతంలో ఉక్రెయిన్ మానవరహిత వైమానిక వాహనం(యూఏవీ) ఆదివారం రాత్రి దాడి చేయడంతో మంటలు వ్యాపించినట్టు రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ దాడికి పాల్పడి ఘోరమైన తప్పు చేసిన వారి పేరును ప్రకటించాల్సిందిగా అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ)ను రష్యా పట్టుబట్టనున్నట్టు పేర్కొన్నది. కాగా, పలు పేలుళ్ల తర్వాత అణువిద్యుత్తు కేంద్రంలోని వాయవ్య ప్రాంతం నుంచి దట్టమైన పొగ రావడం తమ నిపుణులు చూసినట్టు ఐఏఈఏ సైతం ధృవీకరించింది. కాగా, ప్రస్తుతం ఈ కేంద్రంలోని ఆరు యూనిట్లు మూసేసి ఉన్నందున పెను ప్రమాదం తప్పిందని ఈ కేంద్రం కమ్యూనికేషన్స్ డైరెక్టర్ యెవ్జెనియా యషిన తెలిపారు. కాగా, ఉక్రెయిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి రష్యానే ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు.
ఉక్రెయిన్ సరిహద్దున ఉన్న రష్యాలోని బెల్గోరడ్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను రష్యా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. సురక్షిత ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేశామని, వెంటనే ప్రజలు అక్కడకు చేరుకోవాలని స్థానిక ప్రభుత్వం ప్రజలకు తెలిపింది.