రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం సూచించింది. ఎవరికైనా ప్రత్యే క పరిస్థితులుంటే మినహా.. మిగతా వారు మాత్రం స్వదేశానికి రావాలని, తమకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయానికి తెలియజేయాలని సూచించింది.
ఈ ప్రకటనపై స్పందించిన ఉక్రెయిన్
భారత ప్రభుత్వం సూచించిన ఈ ఆదేశాల నేపథ్యంలో ఉక్రెయిన్ స్పందించింది. భారత్లో ఉండే ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న మాట మాత్రం వాస్తవమే. అయితే పరిస్థితులు మాత్రం అంత విషమించి పోలేదు. చేయి దాటలేదు. అంత తొందరగా, హడావుడిగా భారతీయులను, విద్యార్థులను స్వదేశానికి రావాలని సూచించాల్సిన అవసరం లేదు. రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న వాతావరణాన్ని మరీ పెద్దగా చేసి చూపకండి అని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని భారత్లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా పేర్కొన్నారు.