లండన్, ఏప్రిల్ 1: ఇరాన్‌తో అమెరికా జరిపే యుద్ధంలో బ్రిటన్ చేరదని, అయితే వివిధ దేశాలతో అంతర్జాతీయ సదస్సును నిర్వహించి హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నిస్తామని యూకే ప్రధాని సర్ కీర్ స్టార్మర్ తెలిపారు. ఇరాన్‌తో యుద్ధంలో చేరడానికి యూరోపియన్ నాటో దేశాలు నిరాకరించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విమర్శలు చేసిన క్రమంలో కీర్ స్టార్మర్ మాట్లాడుతూ ‘నాపై, ఇతరులపై ఎంత ఒత్తిడి ఉన్నా, ఎన్ని విమర్శలు వచ్చినా, మా దేశ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకుంటాను. ఇది మా యుద్ధం కాదు. అందుకే ఇరాన్‌తో యుద్ధంలో చేరబోం’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం పట్ల ఇప్పటికే పలు దేశాలు అనాసక్తితో ఉన్నాయి. అమెరికా జెట్ విమానాలు తమ వైమానిక స్థావరాలను వినియోగించుకోవడానికి ఇప్పటికే నాటో దేశాలైన ఇటలీ, స్పెయిన్ నిరాకరించాయి.