Insurance | ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మర్డర్లు చేసిన ఘటనలు ఇప్పటివరకు చాలానే చూశాం. కానీ ఇది దీనికి చాలా భిన్నమనే చెప్పొచ్చు. కానీ బ్రిటన్కు చెందిన ఓ డాక్టర్ బీమా డబ్బుల కోసం కక్కుర్తి పడి ఏకంగా తన రెండు కాళ్లను నరికేసుకున్నాడు. ప్రాణాలకు హానీ కలకుండా కాళ్లను ఎలా తొలగించుకోవడం ఎలా అని ఆన్లైన్లో వీడియోలు చూసి మరీ ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం. అయితే సదరు వ్యక్తి తీరుపై అనుమానం వచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీలు కోర్టుకు ఎక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంగ్లండ్ కార్న్వాల్లోని ట్రూరోకు చెందిన నేలీ హోపర్ (49) ఓ డాక్టర్. సెప్సిస్ అనే రక్తనాళ సంబంధిత వ్యాధి కారణంగా మరో వైద్యుడి సహకారంతో రెండు కాళ్లను మోకాళ్ల వరకు తొలగించుకున్నాడు. అనంతరం దాదాపు ఐదు లక్షల పౌండ్లు ( రూ.5.6 కోట్లు) ఇన్సూరెన్స్ క్లైయిమ్ పొందేందుకు రెండు సంస్థలను ఆశ్రయించాడు. అయితే ముందుగా తమకు సమాచారం ఇవ్వకుండా.. కాళ్లు తొలగించుకున్న తర్వాత సమాచారం ఇవ్వడంతో సదరు బీమా కంపెనీలకు అనుమానం వచ్చింది. దీంతో అతను క్లైయిమ్ను పక్కన పెట్టేశాయి. నేలీ హోపర్ కావాలనే డబ్బుల కోసం కాళ్లు తొలగించుకున్నాడని బీమా కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.
శరీరానికి హానీ కలకుండా మోకాళ్లను తొలగించుకోవడం ఎలా అని తెలుసుకునేందుకు పలు వెబ్సైట్ల నుంచి 2018 ఆగస్టు 21వ తేదీ నుంచి 2020 డిసెంబర్ 4 వ తేదీ వరకు వీడియోలను నేలీ హోపర్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఇలా కాళ్లను తొలగించాలని మారియస్ గుత్సావ్సన్ అనే వైద్యుడిని నెయిల్ హోపర్ ప్రోత్సహించారనే అభియోగాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో 2023 మార్చిలో హోపర్ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతను పనిచేస్తున్న రాయల్ కార్న్వాల్ హాస్పిటల్స్ ఎన్హెచ్టీ ట్రస్ట్ విధుల్లో నుంచి తొలగించింది. అదే ఏడాది డిసెంబర్లో మెడికల్ రిజిస్టర్ నుంచి అతని పేరును కూడా తొలగించారు. కాగా, వృత్తిపరంగా హోపర్పై ఎలాంటి ఆరోపణలు లేవని, అతని వల్ల రోగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేవని రాయల్ కార్నివాల్ హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది. అయినప్పటికీ అతన్ని విధుల్లో నుంచి తొలగించామని, విచారణకు సహకరిస్తామని తెలిపింది.
కాగా, సెప్పిస్ అనే రక్తనాళ సంబంధిత వ్యాధి కారణంగానే తాను కాళ్లను తొలగించుకోవాల్సి వచ్చిందని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నెయిల్ హోపర్ తెలిపారు. నిపుణుల సూచన మేరకు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కాళ్లు ఉన్నప్పటి కంటే కూడా కాళ్లు లేకుండానే తాను యాక్టివ్గా ఉన్నానని పేర్కొన్నారు. తాజాగా హోపర్కు సంబంధించిన కేసు మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో వాదాపోవాదనలు విన్న న్యాయమూర్తి అతన్ని దోషిగా నిర్ధారించి.. కస్టడీకి పంపించింది. ఆగస్టు 26వ తేదీన ట్రూరో క్రౌన్ కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.