లండన్, నవంబర్ 16: ఉన్నత విద్య కోసం బ్రిటన్కు వెళ్లాలనుకొంటున్న భారత యువతకు ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ శుభవార్త అందించారు. డిగ్రీ పూర్తిచేసిన 18-30 ఏండ్లలోపు భారతీయులు రెండేండ్లపాటు బ్రిటన్లో చదువుకొనేందుకు, ఉద్యోగం చేసుకొనేందుకు పరస్పర సహకార పథకం కింద ఏటా 3 వేల వీసాలను జారీ చేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు. ఇదేవిధంగా బ్రిటన్ జాతీయులు భారత్లో నివసించేందుకు, పని చేసుకునేందుకు వీలుకల్పించే ఈ పథకంపై యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ (ఎంఎంపీ)లో భాగంగా నిరుడు సంతకాలు జరిగాయి.
వచ్చే ఏడాది ఆరంభం నుంచి అమలయ్యే ఈ పథకాన్ని రిషి సునాక్ బాలీ (ఇండోనేషియా)లో జీ-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రారంభించారు. ఆ సమావేశంలో భారత ప్రధాని మోదీని కలిసి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ధ్రువీకరించారు. ఇరు దేశాల మధ్య వలస భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ పథకాన్ని ఆమోదించామని బ్రిటన్ ప్రభుత్వం పేర్కొన్నది.