Sanjay Bhandari | వివాదాస్పద ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీని భారత్ తీసుకురానున్నారు. సంజయ్ భండారీని భారత్‌కు అప్పగించేందుకు యూకేలోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు సోమవారం అనుమతించింది. సంజయ్ భండారీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును విచారిస్తున్నది. యూకేలో ఉన్న సంజయ్ భండారీని భారత్‌కు రప్పించేందుకు ఈడీ చాలా రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. భారత ప్రభుత్వం తరఫున యూకే కోర్టులో ఈ కేసును వాదించిన ఈడీ.. చివరకు విజయం సాధించింది.
సంజయ్ భండారీపై నల్లధనం సహా పలు సెక్షన్ల కింద ఆదాయం పన్ను అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు 2020 జూన్ 1న ఈడీ ఛార్జిషీట్ నమోదు చేసింది. అదేవిధంగా సంజయ్ భండారీపై పన్ను ఎగవేతతోపాటు ఆయుధాల ఒప్పందంలో ముడుపులు అందాయన్న కేసు నమోదైంది. దాంతో ఆయన ఇండియా నుంచి పారిపోయి యూకేలో తలదాచుకున్నాడు. ఆయనను ఇండియాకు రప్పించేందుకు ఈడీ అధికారులు బ్రిటన్ వెస్ట్‌మినిస్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. సంజయ్ భండారీని తమకు అప్పగించాలని కోరింది. కేసును విచారించిన యూకే కోర్టు.. సంజయ్ భండారీని భారతదేశానికి అప్పగించేందుకు అనుమతినిచ్చింది. అయితే, వెస్ట్ మినిస్టర్ కోర్ట్ ఆదేశాలను యూకే ఉన్నత న్యాయస్థానంలో సంజయ్ భండారీ సవాలు చేసే అవకాశాలున్నట్లు కొన్ని వర్గాల ద్వారా సమాచారం అందింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం రూ. 2,895 కోట్ల విలువ చేసే 75 పిలాటస్ బేసిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు ఒప్పందంలో అవినీతికి సంబంధించి సంజయ్ భండారీపై 2019 లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా కేసు నమోదు చేసింది. ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లైన సంజయ్ భండారీ, బిమల్ సరీన్లతో స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్ ఎయిర్‌క్రాఫ్ట్ లిమిటెడ్ సంస్థ నేరపూరిత కుట్రకు పాల్పడిందని, 2010 జూన్‌లో భండారీతో మోసపూరితంగా సర్వీస్ ప్రొవైడర్ ఒప్పందం కుదుర్చుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఇది డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్, 2008 కింద ఉల్లంఘన జరిగినట్లు సీబీఐ ఆరోపించింది.