United Arab Emirates : బ్రిటీష్ యూనివర్సిటీల్లో ఇస్లాం రాడికలైజేషన్ పెరిగిపోతోంది. చాలా మంది ముస్లింలు ఈ అతివాద ప్రభావానికి గురవుతున్నారు. దీంతో తమ దేశానికి చెందిన ముస్లిం విద్యార్థులకు యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) కీలక హెచ్చరిక జారీ చేసింది. బ్రిటన్ యూనివర్సిటీల్లో చదువుతున్న తమ దేశానికి చెందిన విద్యార్థులు ఇస్లాం రాడికలైజేషన్ కు గురై, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొ్ంటే ప్రభుత్వం అందించే స్కాలర్ షిప్ లు ఆపేస్తామని హెచ్చరించింది.
ఇప్పటికే గత జూన్ లో అలాంటి కొందరు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు నిలిపివేసింది. రాడికలైజేషన్ ప్రభావం ఎక్కువగా కొన్ని బ్రిటన్ యూనివర్సిటీలను ఇప్పటికే బ్లాక్ చేసింది. వాటిల్లో చదివే విద్యార్థులకు స్కాలర్ షిప్ లు రద్దు చేసింది. కొంతకాలంగా బ్రిటన్ లో ఇస్లాం రాడికలైజేషన్ పై చర్చ జరుగుతోంది. దీనికి కారణం ముస్లిం బ్రదర్ హుడ్ అనే సున్నీ సంస్థ. ఈ సంస్థ కొన్ని బ్రిటన్ యూనివర్సిటీల్లో ముస్లిం యువతతోపాటు, మరికొందరు యువతను ఇస్లాం రాడికలైజేషన్ వైపు నడిపిస్తోంది. అంటే బ్రిటన్ ప్రజల్ని ఇస్లాం వైపు నడిపించడం, మత మార్పిడులు, ముస్లిం చట్టాల అమలు వంటి వాటి కోసం ప్రయత్నిస్తోంది. దీంతో ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థను యూఏఈ తీవ్రవాద సంస్థగా పరిగణిస్తోంది. ఇదే సమయంలో బ్రిటన్ కూడా ఇలాగే చేయాలని యూఏఈ కోరుతోంది. కానీ, బ్రిటన్ దీనికి అంగీకరించడం లేదు.
అయితే, ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న బ్రిటన్ యూనివర్సిటీల్లో చదివే తమ దేశ విద్యార్థుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని యూఏఈ నిర్ణయించింది. ఎందుకంటే ఈ రాడికలైజేషన్ ప్రభావం తమ దేశంపై కూడా పడే ఛాన్స్ ఉంది. అందుకే తమ దేశ స్టూడెంట్స్ వీటికి దూరంగా ఉండకపోతే స్కాలర్ షిప్ లు నిలిపివేస్తామని చెప్పింది. ఇటీవల యూఏఈ.. ప్రభుత్వం నుంచి స్కాలర్ షిప్ అందించే విదేశీ యూనివర్సిటీల వివరాల్ని ప్రకటించింది. అయితే, అందులో బ్రిటన్ కు చెందిన చాలా యూనివర్సిటీల్ని తొలగించింది. అమెరికా, అస్ట్రేలియాలోని యూనివర్సిటీలను ఎంపిక చేసింది కానీ, బ్రిటన్ యూనివర్సిటీల్ని మాత్రం తొలగించింది.