UAE : సామాజిక మాధ్యమాలు పిల్లలపై దుష్ప్రభావం చూపుతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా (Social Media) కట్టడికి పలు దేశాలు కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో అరబ్ దేశం యూఏఈ (UAE) కూడా చేరింది. సామాజిక మాధ్యమ వేదికల వినియోగానికి కనీస వయసును 15 ఏళ్లుగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురువారం ఆమోదించింది. దాంతో ఈ తరహా నిబంధన తీసుకొచ్చిన తొలి అరబ్ దేశం (Arab Country) గా యూఏఈ నిలిచింది.
కొత్త నిబంధనల ప్రకారం.. 15 ఏళ్లలోపు చిన్నారులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఖాతాలను తెరిచేందుకు అనుమతి ఉండదు. అంతేకాదు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లోని కొన్ని రకాల ఫీచర్లపై వీరికి యాక్సెస్ కల్పించకూడదు. వయసు సంబంధిత కంటెంట్‌పై ఆంక్షలు, స్క్రీన్ టైమ్, యాప్ వినియోగ సమయంపై పరిమితి వంటి రూల్స్‌ను ఆయా ప్లాట్‌ఫామ్‌లు తీసుకురావాల్సి ఉంటుంది. సోషల్ మీడియాతో పిల్లలకు పొంచి ఉన్న ముప్పును తప్పించడంతో పాటు ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు యూఏఈ ప్రభుత్వం వెల్లడించింది.
ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా ప్లాట్ఫామ్ల్లో మార్పులు చేసేందుకు సోషల్ మీడియా కంపెనీలకు యూఏఈ 12 నెలల గడువు విధించింది. దశల వారీగా ఈ రూల్స్‌ను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. 2024 నాటి గణాంకాల ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పిల్లలు సగటున రోజుకు 3 గంటలపాటు సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నారని సర్వేల్లో తేలింది. చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ తీసుకొచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆ తర్వాత యూకే, మలేసియా లాంటి దేశాలు కూడా ఈ తరహా నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చాయి.