హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేతగాక చిల్లర రాజకీయాలతో బూతుల పాలన చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సచివాలయంలో కూర్చొని ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలుచేయాల్సిన అధికార పార్టీ ఇందిరాపార్ వద్ద ధర్నా చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు.‘చెల్లని రూపాయికి గీతలు ఎకువ.. చేతగాని రేవంత్ రెడ్డికి బూతులు ఎకువ‘ అంటూ ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చలేక బజారు భాష వాడుతున్నారని, ఇది సీఎం రేవంత్ సైకోపాత్ మనస్తత్వానికి నిదర్శనమని చెప్పారు.
తెలంగాణను సాధించిన కేసీఆర్ పై అనుచిత పోస్టర్లు వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎప్పుడు రావాలో కేసీఆర్‌కు బాగా తెలుసని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి గుంటూరు వాళ్లను అల్లుడిని చేసుకోవచ్చు కానీ.. కేటీఆర్ చదువుకుంటే తప్పా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఇందిరాపార్ వద్ద కేటీఆర్‌తో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సీఎంకు సవాల్ విసిరారు. నకిరేకల్ మీటింగ్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాకపోవడమే ప్రభుత్వంలో అంతర్గత సంక్షోభానికి నిదర్శనమని, 80 సార్లు ఢిల్లీకి తిరిగినా హైకమాండ్ మెప్పు పొందలేక వచ్చిన అసహనంతోనే రేవంత్ విపక్షాలపై విరుచుకుపడుతున్నారని విమర్శించారు. రాఖీ కట్టిన కొండా సురేఖకు రక్షణ కల్పించాల్సిందిపోయి.. పదవి నుంచి తప్పించారని మండిపడ్డారు. హామీలను విస్మరించి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డికి రాబోయేరోజుల్లో కాలమే తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.